Jul 26,2023 21:39
  • నేటి నుంచి ఆందోళనలు
  • ఎపి విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ సంస్థల్లోని అన్ని తరగతుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎపి రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(ఎపిఎస్‌పిఇ జెఎసి) వెల్లడించింది. ఈ మేరకు జెఎసి చైర్మన్‌ పి చంద్రశేఖర్‌, సెక్రటరీ జనరల్‌ పి ప్రతాప్‌ రెడ్డి, కన్వీనర్‌ బి సాయికృష్ణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పిఆర్‌సి-2022తో సహా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 16 నెలలు నుంచి విద్యుత్‌ సంస్థ యాజమాన్యాలకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని పేర్కొన్నారు. జులై 27,28 తేదిల్లో బ్యాడ్జ్‌లతో భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 31వ తేదిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయడం, ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్‌ కార్యాలయాలు, హెడ్‌క్వార్టర్లు, జోనల్‌ కార్యాలయాలు జనరేటింగ్‌ స్టేషన్లలో ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. ఆగస్టు 2,3 తేదిల్లో సర్కిల్‌ కార్యాలయాలు జనరేటింగ్‌ స్టేషన్లలో రిలే నిరాహాదర దీక్షలు, 4,5,7 తేదీల్లో నిబంధనల మేరకు పని వేళలు, పని దినాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 8వ తేదిన విద్యుత్‌ సౌధలో మహాధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. 9వ తేదిన యాజమాన్యం ఇచ్చిన సిమ్‌కార్డులను తిరిగి ఇస్తామని వివరించారు. ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని తెలిపారు.