Sep 03,2023 20:30

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉపాధి భద్రత, భవిష్యత్తు కోసం ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ అమల్జేయాలని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్‌ కె సుమన్‌, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు అధ్యక్షతన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ అమల్జేస్తే జీత భత్యాల పెంపు, మెడికల్‌ లీవ్‌లు, ఇంక్రిమెంట్‌ లాంటి అంశాల్లో స్పష్టత ఉంటుందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 'ఆప్కాస్‌' ద్వారా ఉపాధి భద్రత కల్పించినా.. శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో చాలా మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నాలుగో తరగతి స్థాయి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకైనా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర కోశాధికారి గిరి కుమార్‌, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్లయ్య తదితరులు పాల్గొన్నారు.