- పెగాసస్ ప్రత్యామ్నాయ సంస్థ నుంచి కొనుగోలు
- హిందూ డేటా విశ్లేషణలో వెలుగులోకి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిఘా పరికరాల అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. వివాదస్పద పెగాసస్ సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయంగా పేరొందిన కాగ్నైట్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థ నుంచి భారత రక్షణ సంస్థ నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కార్ నిఘా పరికరాల కొనుగోలు అంశంపై నోరు మెదపకుండా దాటవేత వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ కొనుగోలు చేశారా? లేదా అని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినా బిజెపి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా నాన్చుతోంది. ఈ దశలో మరో నిఘా సంస్థ నుంచి పరికరాలు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకిరావడం విశేషం. కేంద్రం రహస్యంగా ఉంచుతూ వస్తున్న ఈ వివరాలు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ 'ద హిందూ' జరిపిన డేటా విశ్లేషణలో బట్టబయలయ్యాయి. కాగ్నైట్ కూడా ఇజ్రాయిల్‌కు చెందిన సంస్థే. ఇది పెగాసస్‌కు పోటీదారుగా ఉంది. పెగాసస్ లాగే అనేక వివాదాలు మూటగట్టుకున్న ఈ సంస్థ అనేక దేశాల్లో కేసులు నడుస్తున్నాయి. అమెరికాలో ఈ కంపెనీపై ఇన్వెస్టర్ల కేసులు కూడా వున్నాయి. ''కాగ్నైట్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను, అసమ్మతివాదులను, నిరంకుశ ప్రభుత్వ విమర్శకులను, ప్రతిపక్షాల కుటుంబాలను, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుంటుంది. వారికి తెలియకుండానే, వారి ఫోన్లు, కంప్యూటర్లపై నిఘా పెట్టి, అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుందని అమెరికా న్యాయ సంస్థ కెస్లర్ టోపాజ్ మెల్టెజర్ అండ్ చెక్ ఎల్‌ఎల్‌పి పేర్కొంది. ''కిరాయికి నిఘా'' పరిశ్రమపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇచ్చిన 'త్రెట్ రిపోర్ట్'ను ప్రస్తావించింది. రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థ (డిఐఎ) పరిధిలోకి వచ్చే సిగల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (ఎస్‌ఐడి)కు మూడేళ్ళుగా కాగ్నైట్, దాని మాతృ సంస్థ వేరియంట్ సిస్టమ్స్ ఇన్‌కార్పొరేషన్‌లు కంప్యూటర్ గేర్‌ను సరఫరా చేస్తున్నాయి. కస్టమ్స్ డేటా ప్రకారం గత కొన్నేళ్ళుగా ఎస్‌ఐడి ఎలాంటి దిగుమతులు చేసుకున్నట్లు లేదు. ఈ ఏడాది జనవరిలోనే ఆ సంస్థ నుండి ఒక ఉత్పత్తి దిగుమతి అయింది. దిగుమతులపై హిందూ అడిగిన ప్రశ్నలకు కాగ్నైట్ స్పందించలేదు. ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన పెగాసస్ స్పైవేర్‌కి పోటీగా ప్రత్యర్ధి సంస్థల నుండి నిఘా పరికరాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం టెండర్లు వేయాలనుకుంటోందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ వ్యాసం పేర్కొంది. అలా భారత ప్రభుత్వం పరిశీలిస్తున్న సంస్థల్లో ఒకటే కాగ్నైట్.










