Jun 08,2023 08:03
  •  ఇద్దరు గల్లంతు
  •  మరో ముగ్గురిని రక్షించిన అగ్ని మాపక సిబ్బంది

ప్రజాశక్తి -సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా : సీలేరు నదిలో నాటు పడవ బోల్తాపడి ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురుని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా డిండిగూడ గ్రామానికి చెందిన కొందరు ఆంధ్రాలోని పడాల్‌పుట్‌ గ్రామంలో వివాహ కార్యక్రమానికి వచ్చారు. తిరిగి నాటు పడవపై సాజిత్‌ కిండిగ, బలరాం, రామ్‌, గోపాల్‌, లచ్చ తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. సింధు గూడ సమీపంలో వారు ప్రయాణిస్తున్న నాటు పడవ బోల్తా పడింది. గమనించిన స్థానికులు ముదిలిపొడ పోలీసులకు, ఖైర్‌పుట్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి రామ్‌ , గోపాల్‌ , లచ్చలను రక్షించారు. సాజిత్‌, బలరాం గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి నాటు పడవలో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.