- అవుకు రిజర్వాయర్‌లో పర్యాటక బోటు బోల్తా
- ఇద్దరు మృతి - ఒకరు గల్లంతు
ప్రజాశక్తి-అవుకు (నంద్యాల జిల్లా) : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో టూరిజం బోటు బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవెలకుంట్ల పోలీస్ కానిస్టేబుల్ దూదేకుల రసూల్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి 14 మంది అవుకు రిజర్వాయర్‌లో జలవిహారం చేసేందుకు టూరిజం శాఖకు చెందిన బోటు ఎక్కారు. రిజర్వాయర్‌లో కొద్ది దూరం వెళ్లేసరికి బోటు లోపలికి ఒక్కసారిగా నీళ్లు రావడంతో బోటు బోల్తా పడింది. దీంతో, బోటులో ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. రిజర్వాయర్ వద్ద ఉన్న కొంతమంది స్థానికులు గమనించి నీళ్లలో పడిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 14 మందిలో 12 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కానిస్టేబుల్ రసూల్ కుమార్తె సాజిత (20), ఆయన అన్న కుమార్తె ఆసియాబి (23) నీటిలో మునిగిపోయారు. వీరిలో ఆసియాబి ఒడ్డుకు తీసుకొచ్చిన అనంతరం చనిపోయారు. సాజిత నీటిలో గల్లంతయ్యారు. నూర్జహాన్ (33) అనే మహిళతోపాటు చిన్నారులు చెస్విక్, హనీ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందారు. డోన్ ఆర్‌డిఒ వెంకటరెడ్డి, డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి, కోవెలకుంట్ల సిఐ ఆదినారాయణరెడ్డి, బనగానపల్లె ఇన్‌ఛార్జి సిఐ ప్రియతమ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.










