- ఫసల్‌లో చేరికతో ప్రైవేటు దందా
- ఉచిత పంటల బీమా లక్ష్యానికి విఘాతం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంలో ఫసల్ బీమా పునరాగమనంతో మరోసారి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు తెరమీదికి రానున్నాయి. గతంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వలన అధికంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తోందని, క్లెయిముల పరిష్కారంలో మితిమీరిన జాప్యం నెలకొంటోందని, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందడం లేదన్నది అనుభవం. ఈ సమస్యలను అధిగమించేందుకంటూ వైసిపి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమేయం లేకుండా రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేసింది. నోటిఫై చేసిన ఏరియాల్లో నోటిఫై చేసిన పంటలు పండించే ఇ-క్రాప్‌లో నమోదైన రైతులందరికీ బీమా వర్తింపజేస్తోంది. కాగా ప్రస్తుత ఖరీఫ్ నుండి కేంద్రానికి చెందిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, తాజా పర్చిన వాతావరణ ఆధారిత బీమా పథకాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరుతుండటంతో మరోమారు ఇన్సూరెన్స్ కంపెనీల పాత్ర మొదలవనుందని సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 'ఎపి జనరల్ ఇన్సూరెన్స్‌్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిజిఐసిఎల్)'ను స్థాపించాలన్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలోకి రాగానే 2019 డిసెంబర్‌లో ఎపిజిఐసిఎల్ ఏర్పాటుపై ఉత్తర్వులివ్వగా ఆ ప్రతిపాదనలు ఐఆర్‌డిఎ, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం తిరిగి ఫసల్ బీమా వైపు మొగ్గు చూపడంతో సొంత బీమా కంపెనీ ఆలోచన విరమించుకున్నట్లేనని చెబుతున్నారు.
రెండేళ్ల కిందటే మార్పులు
2016 ఖరీఫ్ నుండి కేంద్రం ఫసల్ బీమా తీసుకురాగా పలు రాష్ట్రాలు విధి విధానాలు మార్చాలని కోరాయి. క్రమంగా ఎపి. బీహార్, గుజరాత్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఫసల్ బీమా నుండి వైదొలిగాయి. దాంతో పలు చర్చలు, అధ్యయనాల మిగతా 2లో తర్వాత 2020 ఖరీఫ్ నుండి కేంద్రం పథకంలో కొన్ని మార్పులు చేసింది. అప్పటి వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలన్న నిబంధన ఉండగా, స్వచ్ఛందం అని మార్పు చేసింది. లోన్లు తీసుకోని రైతులకు సైతం బీమా స్వచ్ఛందమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రీమియం సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకంటూ డెడ్‌లైన్ నిర్ణయించింది. ఖరీఫ్ చెల్లింపులు సెప్టెంబర్ 30, రబీ చెల్లింపులు మార్చి 31గా పేర్కొంది. గడువులోపు కంపెనీలకు సబ్సిడీ చెల్లించకపోతే తదుపరి మూడు మాసాల్లోపు 12 శాతం వడ్డీ వేసి చెల్లించాలి. అప్పటికీ చెల్లించకపోతే స్కీం నుండి తొలగించేస్తారు. రాష్ట్రం ఫసల్‌లో చేరడంతో ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తానే బీమాను నిర్వహించడంతో ఈ నిబంధనలు ఉండేవి కాదు. ఇప్పుడు అవి అమల్లోకొస్తే కవరేజి వర్తించే రైతుల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇ-క్రాప్ డేటా ఆధారంగా బీమా వర్తించేలా కేంద్రం అంగీకరించినందున సమస్యేమీ ఉండకపోవచ్చనీ చెబుతున్నారు.
ప్రీమియంలోనే మతలబు
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఉచిత పంటల బీమా అమలుకు నోడల్ ఏజెన్సీ కాగా ఫసల్ బీమాలో చేరితే కేంద్రం ఆమోదించిన ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఏజెన్సీలను బిడ్డింగ్ ద్వారా రాష్ట్రం ఎంపిక చేయాలి. కేంద్రం ఆమోదించిన కంపెనీల్లో ఎఐసి వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు రిలయన్స్, బజాజ్ వంటి ప్రైవేటు కంపెనీలూ ఉన్నాయి. బిడ్డింగ్‌లో ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ పంటలకు రైతులు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, హార్టికల్చర్, దీర్ఘకాలిక పంటలకు 5 శాతం చెల్లించాలి. రైతుల ప్రీమియం పోను తతిమ్మా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలన్నది ఫసల్ నిబంధన. బిడ్డింగ్‌లో సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ పెరిగినప్పుడు ప్రీమియం కూడా పెరుగుతుంది. అప్పుడు రైతులు, ప్రభుత్వాలు భరించే అమౌంట్ పెరుగుతుంది. ఒక్కోసారి ప్రీమియం రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలోకొచ్చేసరికి రైతు చెల్లించాల్సిన వాటాను, అలాగే రాష్ట్రం భరించాల్సిన ప్రీమియం సబ్సిడీ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తానంటోంది. ఆ ప్రకారం రైతు చేతి నుండి ఏమీ పడదు. రైతు జేబులో నుండి చెల్లించకపోయినా ప్రీమియం పెరిగితే ప్రభుత్వం పెట్టుకోవాల్సిన నిధులూ పెరుగుతాయి. ఆ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడతాయి. 2016 ఖరీఫ్ నుండి 2019 ఖరీఫ్ వరకు ఫసల్ బీమా అమలైంది. 2019 రబీ నుండి రాష్ట్రం వైదొలిగింది. అప్పటి నుండి కేంద్రం తన ప్రీమియం వాటాను ఇవ్వట్లేదు. ఫసల్‌లో చేరితే కేంద్రం నుండి నిధులొస్తాయి కదా అని రాష్ట్ర సర్కార్ చెబుతోంది.










