Jun 17,2022 21:40

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలహీనపరిచే బైజూస్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, పర్యవేక్షణ పెంచి ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా మాత్రమే విద్యారంగం బలపడుతుందని, కార్పొరేట్‌ సంస్థల ఒప్పందాల వల్ల మెరుగవదని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాలలను కుదించి, ఉపాధ్యాయులను తగ్గించి, ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ.. సంస్కరణల లక్ష్యాలను అమలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించడానికి బదులు కార్పొరేట్‌ సంస్థలకు బోధనా కార్యక్రమం అప్పజెప్పడం అసమంజసమని వివరించారు. ఆన్‌లైన్‌ విద్యా బోధన ప్రత్యామ్నాయం కాదని, దీనివల్ల పేద విద్యార్థులు నష్టపోతారని, భవిష్యత్తులో పుస్తకాలు, ఉపాధ్యాయుల అవసరం ఉండదని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగం చేసిన డిజిటల్‌ విద్య ఎలా విఫలమైందో విదితమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అనే ముసుగులో బైజూస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని, ఇటువంటి ఒప్పందాలకు కోట్లాది రూపాయలు వెచ్చించే బదులు మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని శ్రీనివాసరావు కోరారు.

  • పేదలు విద్యకు దూరం : ఎస్‌ఎఫ్‌ఐ

బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పేదలు విద్యకు దూరమవుతారని, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్న, ఎ అశోక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1850 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ప్రపంచ బ్యాంకు షరతులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను తగ్గించిందని విమర్శించారు. ఆ స్థానంలో ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. నాణ్యమైన విద్య ప్రత్యక్ష బోధన ద్వారానే సాధ్యపడుతుందని తెలిపారు.