Jun 30,2023 22:19

ఐసిసి వన్డే ప్రపంచకప్‌ అర్హత టోర్నీ
హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సూపర్‌ా6లో నెదర్లాండ్స్‌ జట్టు మాజీ ఛాంపియన్‌ శ్రీలంకకు చెమటలు పట్టించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 213పరుగులకే పరిమితం చేసిన నెదర్లాండ్స్‌ ఛేదనలో గెలుపు తీరాలకు చేరి 21పరుగుల దూరంలో నిలిచి ఆలౌటైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 34 పరుగులకే 4వికెట్లు, 131పరుగులకే 7వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ ధనుంజయ(93) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ ఆడాడు.లోయర్‌ ఆర్డర్స్‌ బ్యాటర్స్‌ హసరంగ(20), తీక్షణ(28)తో కలిసి జట్టు స్కోర్‌బోర్డును పెంచాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ కుమార(2) త్వరగా పెవీలియన్‌కు చేరడంతో శ్రీలంక జట్టు 47.4ఓవర్లలో 213పరుగులకు కుప్పకూలింది. వాన్‌ బీక్‌, లీడేకు మూడేసి, జుల్ఫికర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో నెదర్లాండ్స్‌ ఓపెనర్లు నిరాశపరిచినా.. బెర్రెసి(52), లీడే(41), ఎడ్వర్డ్‌(61) రాణించడంతో ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఈ ముగ్గురు ఔటయ్యాక నెదర్లాండ్స్‌ లోయర్స్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ పెవీలియన్‌కు క్యూ కట్టారు. దీంతో నెదర్లాండ్స్‌ జట్టు 40ఓవర్లలో 192పరుగులకు ఆలౌటైంది. తీక్షణకు మూడు, హసరంగకు రెండు, కుమార, మధుశంక, శనకకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ధనుంజయకు లభించింది. మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ జట్టు 6వికెట్ల తేడాతో అమెరికాను ఓడించి 7వ స్థానానికి పరిమితమైంది. అమెరికా 42.4ఓవర్లలో 196పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఐర్లాండ్‌ జట్టు 34.2ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 197పరుగులు చేసి గెలిచింది.