Nov 21,2022 21:31
  • తాత్కాలికంగా సంస్కరణలు నిలిపివేత
  • ఎన్నికల వేళ ప్రతిఘటన భయాలు
  • బడ్జెట్‌ కసరత్తు షురూ..

ప్రజాశక్తి - బిజినెస్‌ డెస్క్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణ, ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీ విక్రయం, ఎరువుల నగదు బదిలీ పథకం లక్ష్యాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు)ల వాటాలను నిరాటంకంగా విక్రయిస్తూ వస్తోన్న మోడీ సర్కార్‌ తాత్కాలికంగా ఈ ప్రక్రియకు విరామం ఇవ్వనుందని తెలుస్తోంది. కార్పొరేట్లకు అనుకూలమైన సంస్కరణాలను కొద్ది రోజులు పాటు పక్కన బెట్టనుందని సమాచారం. దేశంలో 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం, కార్పొరేట్లకు అనుకూలంగా చేసే నిర్ణయాలు బిజెపికి పెద్ద ఎదురు దెబ్బగా మారనున్నాయనే సంకేతాలతో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పిఎస్‌యుల ప్రయివేటీకరణ, వాటాల అమ్మకం వల్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగనుందని.. ప్రతిపక్షాలు దీన్ని ప్రధాన ఆయుధంగా మల్చుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నట్లు ఎఫ్‌ఇ ఓ రిపోర్టులో పేర్కొంది.
2023-24నకు సంబంధించిన బడ్జెట్‌ కసరత్తు ప్రారంభమైంది. ఫిబ్రవరి తొలి వారంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కీలక ఎన్నికల సమయంలో రాబోతున్న ఈ బడ్జెట్‌పై బిజెపి ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించింది. సాధారణ ఎన్నికలకు ముందు తొమ్మిది రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలాంటి ప్రతిఘటనలు రాకుండా ఉండాలంటే.. ఆర్థిక రంగం, వ్యయ సంస్కరణలపై కొంత నెమ్మదిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ''ఎన్నికలకు ముందర ప్రజలు, ప్రతిక్షాల నుంచి వ్యతిరేకత, ప్రతిఘటనను ఎదుర్కుంటే.. భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని బిజెపి పాలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీమా, బ్యాంకింగ్‌ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలు చేపట్టరాదని చాలా మంది బిజెపి నేతలు సూచిస్తున్నారు.'' అని ఓ అధికారి తెలిపారు.
రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒక సాధారణ బీమా కంపెనీని కార్పొరేట్లకు విక్రయించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గత బడ్జెట్‌ 2021-22లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ బ్యాంక్‌ల విక్రయానికి వీలుగా బ్యాంకింగ్‌ చట్టాల సవరణకు సంబంధించిన ఓ కీలక బిల్లును గతేడాది శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ.. అది ఇంకా సభలో ప్రవేశపెట్టబడలేదు. మరిన్ని సంప్రదింపుల తర్వాత ఈ బిల్లును ప్రవేశపెడుతామని తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను ప్రయివేటీకరించాలని నీతి అయోగ్‌ ఇప్పటికే సిఫార్సు చేసింది. మరోవైపు బీమా సంస్థలో కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వ నిర్వహణలోని సాధారణ బీమా కంపెనీల ప్రయివేటీకరణను సులభతరం చేయడానికి వీలుగా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. కాగా.. ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఎరువుల సబ్సీడీని ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఎకరాకు కొంత రాయితీ ఎరువులు లేదా దానికి సమానమైన నగదు బదిలీ చేయాలని యోచించింది. అయితే దీన్ని అమల్లోకి తీసుకువస్తే బిజెపి ప్రభుత్వంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళనలో కేంద్రం కొద్ది రోజులు వేచి చూసే దోరణీలో పడింది.
మోడీ ప్రధానీ అయినప్పటి నుంచి గడిచిన ఎనిమిదేళ్లలో పిఎస్‌యుల్లోని రూ.4.5 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. వాటాల విక్రయం, ప్రయివేటీకరణ కోసం చట్టంలోని అనేక నిబంధనల్ని ఏకపక్షంగా మార్చేసింది. గడిచిన ఎనిమిదేళ్లలో పిఎస్‌యులు కేంద్రానికి రూ.3,25,132 కోట్ల డివిడెండ్‌ను ముట్టజెప్పాయి. అయినా.. ఇలాంటి బంగారు బాతు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడానికే మోడీ సర్కారు ఉత్సాహాంగా ఉందనే విమర్శలు పెరిగాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బిజెపి పొరపాటున అధికారంలోకి వస్తే పిఎస్‌యులు చరిత్రలో మాత్రమే కనబడొచ్చని నిపుణులు, రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.