Mar 26,2023 09:12

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సిసిఎల్‌ 2023 పోటీల్లో భాగంగా శనివారం విశాఖపట్నంలోని వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్‌ పోటీ తెలుగు వారియర్స్‌ భోజ్‌పురి దబంగ్స్‌ ను ఓడించి తమ 4వ సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌ లో భోజ్‌పురి దబంగ్స్‌ పై తెలుగు వారియర్స్‌ విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌ లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భోజ్పూరి దబంగ్స్‌ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌ లో నిర్ణీత 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన తెలుగు వారియర్స్‌ జట్టు కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని 32 బంతుల్లో 6 సిక్స్‌ ల సాయంతో 67 పరుగులు చేసి జట్టు భారి స్కోర్‌ కు బాటలు వేశాడు. ఈ క్రమంలో తెలుగు వారియర్స్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ లో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి ప్రత్యర్థ జట్టు ముందు 32 పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భోజ్‌పురి దబంగ్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లకు 89 పరుగులు చేసి తెలుగు వారియర్స కు 58 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 58 పరుగుల విజయ లక్ష్యం తో బరిలో దిగిన తెలుగు వారియర్స్‌ అద్భుత ప్రదర్శనతో 1 వికెట్‌ కోల్పోయి 58 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు వారియర్స్‌ బ్యాటర్‌ లలో అశ్విన్‌ బాబు 21 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సచిన్‌ జోషి 9 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.