Oct 05,2023 22:15

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ఈనెల 12న వెలువడనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. క్షేత్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు కూడా చివరిదశకు వచ్చాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ బృందం చివరిగా తెలంగాణలో పర్యటించింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో అన్ని అంశాలపై ఇసి చర్చించింది. పోలింగ్‌కు ముందు కసరత్తు అతిత్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను సిఇసి రాజీవ్‌ కుమార్‌ ఆదేశించారు. రేపు ఢిల్లీలో జరిగే సిఇసి సమావేశంలో ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులపై మరోసారి చర్చించనున్నారు.