- కాఫర్ డ్యాం నిర్మాణంతోనే 2022 జులైలో బీభత్సం
- 1986లో నాలుగైదు రోజుల్లో వరద నీరు వెనక్కి
- గతేడాది వరదకు నెలల తరబడి గ్రామాల్లో నీరు
ప్రజాశక్తి- ఏలూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం కిష్టారం, కుక్కునూరు బి బ్లాక్ గ్రామస్తులు
1986లో భద్రాచలం వద్ద 75 అడుగుల నీటిమట్టం వచ్చేసరికి ఎంత వరద వచ్చిందో 2022లో భద్రాచలం వద్ద 71.5 అడుగుల నీటిమట్టానికే అంతకంటే పెద్ద వరద వచ్చింది. అప్పట్లో వచ్చిన వరద నాలుగైదు రోజులకే తగ్గిపోయింది. గతేడాది వచ్చిన వరద నీరు రెండు వారాలకుపైగా గ్రామాలను విడిచి వెళ్లలేదు. అప్పట్లో ఎటువంటి అడ్డంకులూ లేకపోవడంతో వరద నీరు వేగంగా తగ్గిపోయింది. ఇప్పుడు కాఫర్ డ్యాం కారణంగా వరద ఉధృతంగా రావడంతోపాటు వరద నీరు త్వరగా తగ్గలేదు.
అల్లూరి సీతారామరాజు (ఎఎస్‌ఆర్) జిల్లా విఆర్.పురం మండలం చింతరేవుపల్లి గ్రామస్తులు
మా గోదావరి గురించి మాకు తెలుసు. ఈ నదితో మాకు తరతరాల అనుబంధం. కన్నతల్లిగా మేం భావిస్తాం. గోదావరికి నీరు వచ్చినంత వేగంగానే తీసేస్తుంది (తగ్గుముఖం పడుతుంది). 1986 వరదలకు ఇళ్లు వదిలి గుట్టపైకి చేరాం. గుడిసెల్లో తలదాచుకున్నాం. మూడో రోజు నుంచే వరద తగ్గుముఖం పట్టడంతో వారానికే మా పెద్దలను, బిడ్డలను తీసుకుని ఇంటికి చేరాం. కానీ, 2022 వరదకు ప్రాణాలు అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటూ మూడు నెలలు గుట్టపైనే గడిపాం. నరకం అంటే ఇలా ఉంటుందేమో? అనుకున్నాం. కాఫర్ డ్యాం నిర్మాణంతోనే గోదావరి తీయడం లేదు.'

ఇటువంటి వ్యాఖ్యలు ఈ గ్రామాల నిర్వాసితులకే పరిమితం కాలేదు. పోలవరం ముంపు గ్రామాల్లోని ఏ ఒక్కరిని కదిలించినా అదే విషయం చెప్తున్నారు. వీరిలో చాలామంది 1986 వరద సమయంలో యువకులు. అప్పుడు, ఇప్పుడు వరద బాధితులుగా ఉన్న వారే. తమ అనుభవాలను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. దీనినిబట్టి పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగానే 2022 జులైలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలపై గోదావరి వరద తీవ్ర ప్రభావం చూపిందని స్పష్టమవుతోంది. తాజాగా గోదావరి వరద రాక నేపథ్యంలో అక్కడి ప్రజలను 'ప్రజాశక్తి' పలకరించింది.
1986లో వచ్చిన వరద కంటే గతేడాది వచ్చిన వరదతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున నష్టం చవిచూశారు. ఏడు వేలకుపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ రెండు మండలాల్లో 107 హేబిటేషన్స్ ఉండగా 90కుపైగా గ్రామాలు నీటమునిగాయి. మిగిలిన గ్రామాలు సైతం జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. దీంతో, దాదాపు 20 వేల మంది వరద బాధితులుగా మారి పునరావాస కేంద్రాల్లో నెలల తరబడి ఉండాల్సి వచ్చింది.
పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై పాలకులు దృష్టి పెట్టకుండా ప్రాజెక్టు పనులు సాగిస్తుండడం వివాదస్పదంగా మారుతోంది. సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతేడాది మూడుసార్లు వచ్చిన వరదలకు నిర్వాసితులంతా నరకయాతన అనుభవించారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మరోసారి వరద భయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 1986 తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను వణికించింది 2022 వరదలే.
కాంటూరు లెక్కల పేరుతో నిర్వాసితులకు అన్యాయం
1986, 2022 వరదల లెక్కలను పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెబుతున్న కాంటూరు లెక్కలన్నీ అవాస్తవమని తేలుతోంది. కాంటూరు లెక్కల ప్రకారం కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు వెరసి 23 గ్రామాలు 41.15 కాంటూరులో ఉన్నట్లు ప్రభుత్వం ముందు చెప్పింది.
గతేడాది వరదల తర్వాత కాంటూరు లెక్కలపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం లైడార్ సర్వే నిర్వహించింది. ఆ తర్వాత కుక్కునూరు మండలంలో మరో తొమ్మిది గ్రామాలు, వేలేరుపాడు మండలంలో మరో పది గ్రామాలు వెరసి 19 గ్రామాలను ఈ కాంటూరులో చేరుస్తున్నట్లు ప్రకటించింది. దీన్నిబట్టి కాంటూరు సర్వే తప్పుల తడకని తేలిపోయింది. ఇప్పుడు చేసిన లైడార్ సర్వే కూడా శాస్త్రీయంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2022లో ఇళ్లపై కప్పుల నుంచి వరకూ మునిగిపోయిన గ్రామాలను కూడా 45.72 కాంటూరులోనే చూపిస్తున్నారు.
కాఫర్ డ్యాం వద్ద 37 మీటర్ల వరద నీటికే ఇంత పెద్ద వరద వస్తే, ప్రాజెక్టును పూర్తి చేసి నీరు నిలబెడితే మొత్తం జలమయమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ముంపులోనే లేదని పేర్కొంటూ కుక్కునూరు మండలం కివ్వాకలో గిరిజనుల కోసం పునరావాస కాలనీని నిర్మించారు. గతేడాది వరదలకు ఈ కాలనీలో ఇళ్లు నీటమునిగాయి. 1986, 2022 వరదల ప్రాతిపదికన ముంపు లెక్కలు నిర్ధారించి మండలం యూనిట్‌గా లెక్కిస్తే తప్ప, నిర్వాసితులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి ఉధృతిని బట్టి 1986, 2022 వరదలను పరిగణిస్తే, గతేడాది వరద కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగా తెచ్చిన పెట్టిన వరద అని తేలిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా నిర్వాసితు లందరికీ పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాల్సి ఉంది. లేకపోతే నిర్వాసితులు నిత్యం నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
1986 కంటే 2022 వరదే అతి పెద్దది : -షేక్ మహబూబ్ బాషా, కుక్కునూరు, బి బ్లాక్, ఏలూరు జిల్లా

1986 వరద కంటే 2022 వరదే అతి పెద్దది. ఇప్పుడున్న ప్రాంతంలోనే అప్పుడు ఉన్నాం. అప్పటి కంటే ఇప్పుడు దాదాపు నాలుగైదు అడుగుల ఎత్తు మెరక చేసుకుని ఇళ్ల నిర్మాణం చేసుకున్నాం. అప్పుడు ఇంటిని వరద చుట్టుముట్టింది. అప్పటికంటే ఇప్పుడు ఎత్తులో ఇల్లు కట్టుకున్నా 2022 వరదలకు కూడా ఇంటి చుట్టు వరద వచ్చింది. అప్పట్లో నాలుగైదు రోజులకు వరద తగ్గిపోయింది. ఈసారి వచ్చిన వరద వారం రోజులకుగానీ తగ్గలేదు. అలాంటి ప్రాంతాన్ని 45.72 కాంటూరులో చేర్చి పరిహారం ఇవ్వడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
వరద ఒక్కసారిగా వచ్చిపడింది : -సోడే కన్నయ్య, కిష్టారం, ఏలూరు జిల్లా

1986లో వర్షాలు కురిసి, చెరువులు నిండిన తర్వాత వరద వచ్చింది. గతేడాది ముందురోజు పశువులను మేతకు తోలుకు వెళ్లాం. తేల్లారే సరికి వరద ముంచెత్తింది. వెంటనే కిష్టారం గుట్ట వద్దకు వెళ్లి తలదాచుకున్నాం. అప్పట్లో ఏ అడ్డూ లేకపోవడంతో వరద వెంటనే తగ్గిపోయింది. 2022లో వరద త్వరగా తగ్గలేదు. మాకు ఇప్పటికీ ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇవ్వడం లేదు.
కాఫర్ డ్యాం కట్టినప్పటి నుంచి ఏటా ముంపే : - ముత్యాల సీతయ్య, చింతరేవుపల్లి, విఆర్.పురం మండలం, ఎఎస్‌ఆర్ జిల్లా

పోలవరం కాఫర్ డ్యాం కట్టినప్పటి నుంచి ఏటా వరద ఊరిని ముంచేస్తోంది. నాకు ప్రస్తుతం 70 ఏళ్లు. గోదావరి వరదలు ఐదు దశాబ్దాలుగా చూస్తున్నాను. కానీ, గతేడాది వరదకు జులై 14 నుంచి సెప్టెంబరు 14 వరకూ మూడు నెలల పాటు గ్రామంలోని గుట్టపైనే గుడారాలు వేసుకుని జీవించాం. గతంలో ఎప్పుడూ ఇంతకాలం ఉండాల్సిన అవసరం రాలేదు.
1986 వరద ప్రభావం చాలా తక్కువ : - ముత్యాల శోభన్ బాబు, చింతరేవుపల్లి, విఆర్.పురం మండలం, ఎఎస్‌ఆర్ జిల్లా

2022తో పోల్చితే 1986 వరద ప్రభావం చాలా తక్కువ. అప్పటి వరదకు గుట్ట కింద ఉన్న చేతి పంపు మునిగింది. తాజా వరదకూ ఈ పంపు మునిగిపోయింది. మా ఊరి వరదలకు ఇదే గీటు రాయి. అయితే, 1986లో మూడో రోజు నుంచే వరద తగ్గుముఖం పట్టింది. ఇళ్లు శుభ్రం చేసుకుని వారానికే తిరిగి వచ్చాం. గతేడాది వరదలకు మూడు నెలలు ఊరు ముంపులోనే ఉంది. దీంతో, అన్ని కుటుంబాలకూ గ్రామంలోని గుట్టే దిక్కైంది.
గుక్కెడు నీళ్లు అందించేవారు కరువు : - కోట్ల బాలరాజు, చింతరేవుపల్లి, విఆర్.పురం మండలం, ఎఎస్‌ఆర్ జిల్లా

1986 వరదలకు గ్రామంలోని గుట్టపై కుటుంబాలతో ధైర్యంగా ఉన్నాం. హెలికాఫ్టర్ ద్వారా ఆహార పొట్లాలు విసిరేవారు. రోజుకు రెండుసార్లు వచ్చేది. ఆకలి, దప్పికలకు బాధలు పడలేదు. గతేడాది వరదలకు మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. టార్ఫాలిన్లు, ఆహారం పొట్లాల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. 500 కుటుంబాలకు గుంట కింద ఉన్న చేతిపంపే దిక్కైంది. మరో అడుగు వరద వస్తే అదీ మునిగిపోయేది.
వరద అంటేనే ప్రాణంపోతోంది : - ముత్యాల సావిత్రి, చింతరేవుపల్లి, విఆర్.పురం మండలం, ఎఎస్‌ఆర్ జిల్లా

గతంలో గోదావరి అంటే భయపడేవాళ్లం కాదు. పది లేక 15 సంవత్సరాలకు ఒక్కసారి ఉధృతంగా వచ్చేది. తర్వాత రోజుల వ్యవధిలోనే తగ్గిపోయేది. మూడేళ్లుగా ఏటా వరద తీవ్రత పెరిగింది. 1986 వరదలకు నా వయస్సు 25 ఏళ్లు. చంటి బిడ్డలతో గుట్టపైకి వెళ్లి వారం రోజులు గుడారంలోనే ఉన్నాం. 2022 వరదలకు నా కోడలు నిండు గర్బిణి. చుటూ వరద నీరు. నావలో కోతుల గుట్టకు చేర్చి కాన్పు చేశాం. ఆ సాయమూ అందకపోతే ఏమై పోయేవాళ్లమో. అందుకే గోదారి వరద అంటేనే ప్రాణం పోతోంది.










