Jul 08,2023 22:34

ఢాకా: బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈమేరకు శుక్రవారం ఓ ప్రకటనలో.. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి తనను ఇంటికి ఆహ్వానించారని, మళ్లీ ఆడమని కోరారని, దీంతో తాను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీడియాతో తెలిపాడు. రిటైర్మెంట్‌ నిర్ణయంపై తాను ఎవరికైనా సమాధానం చెప్పగలను గానీ దేశ ప్రధాని పిలిచి రిటైర్మెంట్‌ నిర్ణయంపై పునరాలోచన చేయమని కోరడంతో.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ మళ్లీ క్రికెట్‌ బ్యాట్‌ పట్టనున్నట్లు తమీమ్‌ ఇక్బాల్‌ తెలిపాడు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో తమీమ్‌ భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడో వన్డేకు తమీమ్‌ ఇక్బాల్‌ మళ్లీ బ్యాట్‌ పట్టి మైదానంలోకి దిగనున్నాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న తమీమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘన్‌తో మిగిలిన వన్డేలకు లింటన్‌ దాస్‌కు పగ్గాలు అప్పగించింది. అలాగే బిసిసిఐ అధ్యక్షులు నజ్ముల్‌ హక్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బహిరంగంగా కోరాడు.