Jun 05,2023 13:48
  • 'ఫిట్‌నెస్‌' పేరుతో పొట్టగొట్టే నిర్ణయం
  • త్వరలో అమలుకు కసరత్తు
  • రోడ్డున పడనున్న 3 వేల మంది డ్రైవర్లు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుమల ట్యాక్సీ డ్రైవర్ల పొట్టగొట్టేలా టిటిడి పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. ఇటీవల తిరుమల ఘాట్‌రోడ్డులో జరిగిన వరుస ప్రమాదాలను 'బూచి'గా చూపి 15 ఏళ్లు దాటిన ట్యాక్సీలను 'ఫిట్‌నెస్‌' పేరుతో అలిపిరి వద్దనే నిలిపేయనుంది. ఆర్‌టిఒ 'ఫిట్‌నెస్‌' సర్టిఫికెట్‌ ఇచ్చినా ససేమిరా అననుంది. ఇదేగనుక జరిగితే దాదాపు మూడు వేల మంది ట్యాక్సీ డ్రైవర్లు రోడ్డున పడనున్నారు. తిరుమలకు వెళ్లే ప్రయివేట్‌ ట్యాక్సీలకు సంబంధించి ఇంతవరకూ ఎటువంటి ప్రమాదమూ జరిగిన దాఖలాలు లేవు. 'ఫిట్‌నెస్సే' ప్రాతిపదిక అయితే, తాజాగా ఆర్నెల్ల క్రితం నుంచి ఘాట్‌లో తిప్పుతున్న ఎలక్ట్రికల్‌ బస్సు బోల్తా పడడం గమనార్హం. పచ్చదనం నిండిన తిరుమల అందాలను తిలకించేందుకు ఎక్కువమంది భక్తులు ట్యాక్సీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆహ్లాదంగా కనిపించిన చోట ట్యాక్సీలను ఆపి మరీ ఫొటోల జ్ఞాపకాలను భద్రపరచుకుంటారు. తిరుమల బస్సుల్లో ఈ సౌకర్యం ఉండదు. అందుకే తిరుమలను నమ్ముకుని ఐదు వేల మందికిపైగా ట్యాక్సీ డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. తిరుపతి శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, కోనేటికట్ట వద్ద ట్యాక్సీ స్టాండులను ఏర్పాటు చేసుకుని సందర్శకులకు తిరుమలతో పాటు జిల్లాలోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. అలాంటివారి కడుపుగొట్టేలా 15 ఏళ్లు పైబడిన ట్యాక్సీలను తిరుమల కొండకు అనుమతించేది లేదని హుకుం జారీకి టిటిడి రంగం సిద్ధం చేసింది. ఇటువంటి ట్యాక్సీలు మూడు వేల వరకూ ఉంటాయని సమాచారం. దీంతో, వీటి డ్రైవర్లు ఆందోళనతో ఉన్నారు. తిరుపతి ట్యాక్సీ డ్రైవర్లకు ఘాట్‌ రోడ్డులో ప్రయాణంపై పూర్తి అవగాహన ఉంది. ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా అనేక సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, బయట ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్లకు ఘాట్‌రోడ్డు మలుపులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వాహనాలపై టిటిడి ప్రత్యేక దృష్టి సారించాలని, తమ పొట్టగొట్టొద్దని వారు వేడుకుంటున్నారు.

 

22

                                                                             కొండనే నమ్ముకున్నాం

డిగ్రీ వరకూ చదువు కున్నాను. ఉద్యోగం లేదు. ట్యాక్సీనే జీవనోపాధిగా కొండనే నమ్ముకుని 12 ఏళ్లుగా డ్రైవర్‌గా ఉంటున్నాను. ఏ మలుపు వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు బాగా తెలుసు. నాకు తెలిసి తిరుమలకు ట్యాక్సీ నడిపే వాహనాలకు సంబంధించి ఒక్క ప్రమాదమూ జరగలేదు. ఉన్నట్లుండి టిటిడి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మా పొట్టగొట్టడమే.
                                                       - యువరాజ్‌, తిరుపతి

 

33

                                                                    సొంత వాహనదారుల వల్లే ప్రమాదాలు

శ్రీవారి సందర్శకులపై ఆధారపడి 15 ఏళ్లుగా ట్యాక్సీ నడుపుతున్నాను. తిరుమల ఘాట్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఘాట్‌లో వాహనం నడిపే అనుభవం లేనివారి వల్లే. లోకల్‌ ట్యాక్సీలు ఎక్కడా ప్రమాదాలకు గురికావడం లేదు. సందర్శకులను సురక్షితంగా కొండకు తీసుకెళ్లి, తీసుకొస్తున్నాం. దయచేసి ఫిట్‌నెస్‌ పేరుతో మా పొట్టగొట్టొద్దు.
                                                                     - ప్రతాప్‌నాయక్‌

                                                                         తిరుమల ఘాట్‌లో

ప్రమాదాలకు కారణాలివే... శ్రీ టిటిడి, ఆర్‌టిఒ అధికారులు సమన్వయంతో ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాల ఫిట్‌నెస్‌ను పరిశీలించాలి. డ్రైవర్లకు హెవీ వెహికల్‌ లైసెన్స్‌ ఉందో? లేదో? పరిశీలించే నాధుడే లేడు.

  • తిరుమల ఘాట్‌ రోడ్‌లో టిటిడి నిబంధనల ప్రకారం 28 నిమిషాలు తిరుమల కొండకు వెళ్లేందుకు, తిరుపతికి 40 నిమిషాలు సమయపాలన పాటించాలి అని ప్రయివేటు వాహన డ్రైవర్లకు తెలిసేలా ఘాట్‌రోడ్‌లో ఎక్కడా 'సూచిక బోర్డులు' ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
  • టిటిడి అధికారులు రెండు ఘాట్‌ రోడ్లలో 'స్పీడ్‌ లిమిట్‌ కెమెరాలను' ఏర్పాటు చేసి స్పీడ్‌ లిమిట్‌ను అతిక్రమించిన వాహనాలకు జరిమానా విధిస్తే ప్రమాదాలు నివారించవచ్చు !