Sep 24,2023 20:45

కడప సెంట్రల్‌ జైలు వద్ద స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి
ప్రజాశక్తి - కడప అర్బన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా):అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పుంగనూరు, అంగళ్ల అల్లర్ల కేసులో అరెస్టయిన 52 మందికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో వారు ఆదివారం కడప సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. 60 రోజుల పాటు జైలు శిక్షణ అనుభవించారు. జైలు నుంచి విడుదలైన వారికి టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాధవిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్థన్‌రెడ్డి, హరిప్రసాద్‌, షాజహన్‌బాష స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొడవల్లో తమ ప్రమేయం లేకపోయినా వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించిందని వాపోయారు. టిడిపి నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు పెట్టడమే వైసిపి ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అల్లర్ల ఘటనలో ఉన్నారా.. లేరా అని విచారణ కూడా చేయకుండా పోలీసులు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి పాలనకు ప్రజలకు చరమ గీతం పాడి, టిడిపికి పట్టకడుతారని వారు ధీమా వ్యక్తం చేశారు.