Oct 17,2023 14:33

అమరావతి: జైళ్ల శాఖ డీఐజీకి టిడిపి నేతలు వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు లీగల్‌ ములాఖత్‌లు తగ్గించడంపై డీఐజీ రవికిరణ్‌తో టిడిపి నేతలు చర్చించారు. చంద్రబాబుపై మూడు న్యాయస్థానాల్లో వివిధ కేసులు కొనసాగుతున్నాయనీ.. ఆయన న్యాయవాదులతో మాట్లాడాల్సి ఉందని వివరించారు. ఇలాంటి సమయంలో లీగల్‌ ములాఖత్‌లు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. రోజుకు రెండుసార్లు లీగల్‌ ములాఖత్‌లు ఇవ్వాలని కోరారు. టిడిపి నేతలు లేవనెత్తిన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఐజీ తెలిపారు.
చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్‌ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. చంద్రబాబు ములాఖత్‌ల కారణంగా సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఎదురవుతుందంటూ రోజుకు ఇవ్వాల్సిన రెండు లీగల్‌ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్‌ రద్దు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఐదు వారాలుగా లేని భద్రతాపరమైన ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చిందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే లీగల్‌ ములాఖత్‌లు కుదించారని ధ్వజమెత్తారు. కేసులపై లాయర్లతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబసభ్యులు భావిస్తున్న ఈ సమయంలో ములాఖత్‌పై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి నేతలు డీఐజీని కలిసి వినతి పత్రం అందించారు.