Sep 17,2023 21:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉపాధ్యాయులపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని పొగడవని, ఎప్పుడూ నిందిస్తూ ఉంటాయని చేసిన వ్యాఖ్యలు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిఏటా వేలకోట్ల రూపాయలు విద్యారంగంపై ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, దీనివల్ల ప్రభుత్వ విద్యారంగం బలపడితే సంతోషించే వారిలో ఉపాధ్యాయ సంఘాలే ముందు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా విద్యారంగానికి ఎన్ని హంగులు చేకూర్చినా వాస్తవంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మంత్రి చెప్పాలని కోరారు. ఉపాధ్యాయులను పాఠాలు చెప్పనీయకుండా బోధనేతర పనులు ఎందుకు అప్పగిస్తున్నారో, 12వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎందుకు ఏర్పడ్డాయో మంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. జూన్‌లో ప్రభుత్వపరంగా బదిలీలు నిర్వహించి, దొడ్డిదారిన వందలాది అక్రమ బదిలీలు ఎందుకు చేస్తున్నారో? ఇంతవరకు జీతాలు ఎందుకు చెల్లించలేకపోయిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. విద్యార్ధులకు నాణ్యమైన బోధన చేస్తున్న ఉపాధ్యాయులు నూటికి 90శాతానికి పైగా ఉన్నారనే విషయం మంత్రి గ్రహించాలని సూచించారు. ఎంతో ఒత్తిడికి గురవుతూనే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడంలో రాజీలేకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులను నిందించడం మంత్రిస్థాయికి తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను కించపరుస్తూ మాట్లాడటం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరుస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై, సంఘాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
'ఉపాధ్యాయ సంఘాలు అత్యంత ప్రమాదకరమ'ని మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్టియు ప్రధాన కార్యదర్శి హెచ్‌ తిమ్మన్న తెలిపారు. ఈ వాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రికి ఫేషియల్‌ యాప్‌కు, థంబ్‌కి తేడా తెలియకపోవడం విచారకరమని ఫ్యాప్టో శ్రీకాకుళం చైర్మన్‌ మదన్‌ మోహన్‌, సెక్రటరీ జనరల్‌ కొమ్ము అప్పలరాజు మరో ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పలుకుబడితో బదిలీలు పొందిన కొందరు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు సరిగా వెళ్లకుండా వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారని పేర్కొన్నారు.