Apr 25,2023 09:36
  • అగర్వాల్‌ పోరాటం వృథా
  • ఢిల్లీ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమి

హైదరాబాద్‌ : ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 145పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 137పరుగులే చేయగల్గింది. తొలుత సన్‌రైజర్స్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కి తోడు సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో రాణించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 144పరుగులకే పరిమితమైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపింది. వాషింగ్టన్‌ సుందర్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. ఎనిమిదో ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. రెండో బంతికే వార్నర్‌(21), నాలుగో బంతికి సర్ఫరాజ్‌ ఖాన్‌(10), చివరి బంతికి అమాన్‌ ఖాన్‌(4) ను ఔట్‌ చేశాడు. దీంతో ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 62 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లోని రెండో బంతిని ఆడిన వార్నర్‌... బ్రూక్‌కు దొరికాడు. నాలుగో బంతికి సర్ఫరాజ్‌... భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పోవడంతో ఢిల్లీ ఆ తర్వాత ఆచితూచి ఆడింది. ఆ తర్వాత మనీష్‌ పాండే 34, అక్షర్‌ పటేల్‌ 34 పరుగులు రాణించడంతో ఢిల్లీ ఆ మాత్రమైనా స్కోర్‌ చేయగలిగింది. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో సుందర్‌కు మూడు, భువనేశ్వర్‌ కుమార్‌కు రెండు, నటరాజన్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
         ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. బ్రూక్‌(7) మరోసారి నిరాశపరచగా.. అగర్వాల్‌(49) అర్ధసెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత త్రిపాఠి(15), అభిషేక్‌ శర్మ(5), కెప్టెన్‌ మార్‌క్రమ్‌(3) స్వల్ప స్కోర్‌కే పెవీలియన్‌కు చేరాడు. దీంతో సన్‌రైజర్స్‌ జట్టు 85పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో గాయపడ్డ సుందర్‌(24నాటౌట్‌) భారీ షాట్స్‌ కొట్టలేకపోయాడు. క్లాసెన్‌(31) పోరాడినా నోర్ట్జే బౌలింగ్‌లో ఔటవ్వడంతో సన్‌రైజర్స్‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. చివరి ఓవర్లో 13పరుగులు చేయాల్సిన సన్‌రైజర్స్‌ జట్టు నోర్ట్జే వేసిన బౌలింగ్‌లో 5పరుగులచే చేయడంతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఐదో పరాజయాన్ని చవిచూసింది.

11

 

22