May 06,2023 21:57

బెంగళూరు: 5వ జాతీయ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సుమిత్‌ అంటిల్‌ నయా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. శనివారం జరిగిన ఎప్‌-64 జావెలిన్‌ త్రో విభాగంలో సుమిత్‌ ఈ రికార్డును నమోదు చేశాడు. సుమిత్‌ జావెలిన్‌ను 70.17మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును నెలకొల్పడంతోపాటు 2023 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ పోటీలకు అర్హత సాధించాడు. నయా ప్రపంచ రికార్డు నెలకొల్పిన అనంతరం సుమిత్‌ మాట్లాడుతూ.. జావెలిన్‌ను 80మీటర్లు విసరమే తన లక్ష్యమని, రాబోయే ఆసియా క్రీడల్లో 75మీటర్ల మార్క్‌ను అందుకుంటానన్న నమ్మకం ఉందని తెలిపాడు. గతంలో ఈ రికార్డు సుమిత్‌ పేరు మీద ఉంది. 2022లో సుమిత్‌ 68.62మీటర్లు జావెలిన్‌ విసిరి ప్రపంచ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. 2020 టోక్యో పారా ఒలింపిక్స్‌ జావిలిన్‌ త్రో విభాగం ఎఫ్‌-64/44 ఫైనల్లో సుమిత్‌ 68.55మీటర్లు విసిరి తొలుత ప్రపంచ రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.