ఢిల్లీ:డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ తరహాలోనే.. బీమా రంగంలో సుగమ్ సరికొత్త శకానికి నాంది పలుకుతుందని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దేవాశీష్ పాండా అన్నారు. 2016లో ప్రారంభమైన యూపీఐ తక్కువ కాలంలో ప్రపంచం దఅష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గతనెలలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.11 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అదే తరహాలో బీమా రంగంలో సుగమ్ సైతం విజయాన్ని అందుకుంటుందని పాండా తెలిపారు. బీమా పాలసీల కొనుగోలు, అమ్మకాలు సహా ఇతర సేవలకు ఉమ్మడి వేదికగా సుగమ్ నిలవనుందని పేర్కొన్నారు. క్లెయిం సెటిల్‌మెంట్లు కూడా దీని ద్వారానే జరుగుతాయన్నారు. వ్యక్తిగత ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా ఇతర బీమా మధ్యవర్తులందరికీ సుగమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పాలసీదారులు సైతం నేరుగా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. లేదంటే మధ్యవర్తులను సంప్రదించైనా సేవల్ని పొందొచ్చని తెలిపారు.
పాలసీ, కంపెనీని ఎంచుకునే విషయంలో సుగమ్ ద్వారా అనేక ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పాండా తెలిపారు. వాటిలో మెరుగైన వాటిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఫలితంగా వివిధ కంపెనీలు, వివిధ పాలసీల మధ్య పోలికకు వినియోగదారుడికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సుగమ్ ఓ షాపింగ్ మాల్ తరహాలో పనిచేస్తుందని వివరించారు. కేవైసీ విషయానికి వస్తే ఒక్క ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుందని తెలిపారు. వివరాలన్నీ దానికవే వచ్చేస్తాయని చెప్పారు.










