- ముంపు మండలాల గిరి పల్లెల్లో విద్యార్థుల కష్టాలు
- శిథిలావస్థలో పాఠశాలలు
- ఈ విద్యా సంవత్సరంలో 1092 మంది డ్రాపౌట్స్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం ముంపు మండలాల్లోని గిరి పల్లెల్లో బడి బాధ వెంటాడుతోంది. ఓ వైపు గోదావరి వరదలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల చదువులను నిలువునా ముంచుతున్నాయి. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలలోనే బోధన చేపట్టడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. వెరసి డ్రాపౌట్స్ శాతం పెరుగుతోంది. విలీన మండలాలైన ఎటపాక, విఆర్.పురం, కూనవరం, చింతూరు మండలాల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 17,995 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 16,903 మంది మాత్రమే పాఠశాలల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనినిబట్టి 1,092 మంది విద్యార్థులు డ్రాపౌట్ అయినట్లు స్పష్టమవుతోంది. ముంపు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. ఎటపాక, కూనవరం, విఆర్‌పురం, చింతూరు మండలాల పరిధిలో 314 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ స్కూల్స్ 266, అప్పర్ ప్రైమరీ 17, హైస్కూల్స్ 314. ఈ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 16,903 మంది విద్యనభ్యసిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 6.5 శాతం మంది డ్రాపౌట్ అయ్యారు. దీనిపై చింతూరు ఎంఇఒ లక్ష్మీనారాయణను వివరణ కోరగా, విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్ చేయడంలో ఆలస్యం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య పెరిగినట్టు కనిపిస్తోందని చెప్పారు.
అధ్వానంగా పాఠశాలలు
ప్రభుత్వం నాడు-నేడు అంటూ గొప్పలు చెప్పుకుంటుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలు చినుకుపడితే చిత్తడిగా, ఎండా కాలం తీవ్రవేడితో విద్యార్థులకు అసౌకర్యంగా మారాయి. పక్కా భవనాలు లేకపోవడం, నేలపై గచ్చు లేకపోవడంతో మట్టిలోనే కూర్చోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో పాఠశాల పాకలు కారిపోతున్నాయి. గాలి దుమారం వస్తే పైకప్పు విరిగిపడుతుందేమోననే భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు.
గిరిజన మాతృ భాషలో బోధనపై చిత్తశుద్ధి కరువు
గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసీలకు వారి మాతృభాషలో విద్యా బోధనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. తూర్పు ఏజెన్సీ మండలాల్లో కోయ తెగకు చెందిన అత్యధిక మంది విద్యార్థులు ఉన్నారు. వారికి మాతృభాషలో పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు బోధించేందుకు వలంటీర్లను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమై నెల గడిచినా ఇప్పటికీ మాతృభాషా వలంటీర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. దీంతో, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వస్తే క్లాసులు బంద్
వర్షం వస్తే తరగతులు నిర్వహించడం లేదు. బిల్డింగ్ స్లాబు నుంచి నీరు కారడంతో తరగతి గది పూర్తిగా చిత్తడిగా మారుతోంది. సబ్జెక్టు టీచర్లు లేరు. 200 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. స్కూలుకు రంగులు మాత్రమే వేశారు. స్లాబు లీకులకు మరమ్మతులు చేయలేదు. కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు నిలిచిపోయి రెండేళ్లవుతోంది. ఆ భవనం త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది.
-కుంజా సీతామహాలక్ష్మి, కస్తూర్బా పాఠశాల, విఆర్.పురం మండలం

చెట్ల కింద వంట
పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. మధ్యాహ్న భోజనం వండేందుకు ఎటువంటి సౌకర్యాలూ లేవు. ఆరుబయటే చెట్ల కింద కట్టెలతో వంట చేస్తున్నాం. వర్షం కురిస్తే కట్టెలు తడిసిపోతున్నాయి. కష్టపడి పొయ్యి వెలిగించినా మంట నిలబడే పరిస్థితి లేదు. వంట చేసుకునేందుకైనా షెడ్లు ఏర్పాటు చేయాలి.
-సున్నం రాజమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, ప్రాథమిక పాఠశాల, ఉమ్మడివరం, విఆర్.పురం మండలం











