Jul 25,2023 10:06

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : పోలవరంపై బ్యాక్‌వాటర్స్‌ ప్రభావంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి మురళీధర్‌ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ)కు సోమవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. సర్వే చేయడానికి గతంలో ఒప్పుకున్న ఎపి సర్కారు, ఇప్పుడు జాప్యం చేయడం సరికాదన్నారు. 2016 నుంచి లేఖలు రాస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. అధ్యయనం చేయడంలో ఆలస్యం మూలంగా నష్టం జరుగుతుందని గుర్తుచేశారు. బ్యాక్‌వాటర్స్‌ మూలంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. గత ఏడాది కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చినా దృష్టిపెట్టడం లేదని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రంలోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాయయని చెప్పారు. ఆ మేరకే కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. సారపాక ఐటిసి, మణుగూరు హెచ్‌డబ్ల్యుపి, భద్రాచలం పట్టణానికి ముప్పు ఉందన్నారు. 28 వేల ఎకరాలు మునిగిపోయే ప్రమాదముందని ఎప్పటికప్పుడు చెబుతున్నామని వివరించారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో సమస్యలు తలెత్తె అవకాశం ఉందని, అలాగే గోదావరిలో వరద బాగా వస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అధ్యయనం చేయాలని కోరారు. గతంలో సంయుక్త సర్వే చేయాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే సమాచారం అడిగినా ఇవ్వడం లేదని సిడబ్ల్యుసికి గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినా సంయుక్త సర్వే చేయలేదని, వర్షాకాలం ప్రారంభమైతే సర్వే చేయడానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయని ముందే చెప్పామని అన్నారు.