- కుక్కునూరు, వేలేరుపాడులో ఇప్పటికీ తెరుచుకోని స్కూళ్లు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : గోదావరి వరద విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేసింది. వరద ఉధృతికి విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో పాఠశాలల భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముంపు బాధితులు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీల్లో తలదాచుకోవడంతో గడిచిన 20 రోజులుగా విద్యార్థులు చదువుకు దూరమ య్యారు. గ్రామాలకు ఎప్పుడు వెళ్తారో, విద్యార్థులు చదువు ప్రారంభించేదెప్పుడో తెలియని అయో మయం నెలకొంది. వేలేరుపాడు మండలంలో 54 పాఠశాలలు ఉండగా 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. గోదావరి వరదలకు గ్రామాలన్నీ ముంపునకు గురికావడంతో అక్కడి ప్రజలంతా పునరావాస కాలనీలకు చేరారు. వరదలకు పాఠశా లల భవనాలు సైతం నీట మునిగాయి. దీంతో పిల్లలు కూర్చునే బెంచీలు, విద్యార్థుల కోసం ఉపయోగించే ఇతర సామగ్రి, రికార్డులు మొత్తం దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కొయిదా, కట్కూరు, రుద్రమ్మకోట, రేపాకగొమ్ము, వేలేరుపాడు, నాగులగూడెం, ఎర్రబోరు వంటి పలు గ్రామాల్లోని రోడ్లు, ఇళ్లు బురదతో నిండిపోయాయి. దీంతో ఇప్పట్లో ఇళ్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లోని పాఠశాలలు సైతం తెరిచే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికీ వేలేరుపాడు మండలంలో 32 పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. కుక్కునూరు మండలంలో 65 స్కూల్స్ ఉండగా, 4,045 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మండలంలోని గొమ్ముగూడెం, దాచారం ఎస్‌సి కాలనీ, కుక్కునూరు 'ఎ' బ్లాక్ కౌండిన్యముక్తి, మాధవరం గుప్ప, ఎల్లప్పగూడెం వంటి పలు గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల కుటుంబాలు ఇప్పటికీ రావికుంట, కివ్వాక, మర్రిపాడు, పుల్లప్పగూడెం, వెంకటాపురంలో నిర్మించిన నిర్వాసిత కాలనీల్లోనే ఉన్నారు. పలుచోట్ల పాఠశాలలు తెరిచినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అంతా పునరావాస కాలనీల్లో ఉండటంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కునూరు మండల కేంద్రంలోని హైస్కూల్లో 245 మంది విద్యార్థులు చదువుతున్నారు. వరదకు స్కూల్లోని ఫర్నీచర్ మొత్తం దెబ్బతినడంతో ఇప్పటికీ హైస్కూల్ తెరవలేదు. రెండు, మూడు నెలలు విద్యార్థులు చదువుకు దూరమైతే ఈ విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో తమ పిల్లల చదువుల పరిస్థితి ఏమిటన్న బెంగ తల్లిదండ్రులను వేధిస్తోంది.
పాడైన పాఠశాల రికార్డులు, విద్యార్థుల పుస్తకాలు
వరదలకు కట్టుబట్టలతో అంతా పునరావాస కాలనీలకు చేరారు. గ్రామాలను వరద ముంచెత్తడం తో విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు తడిసి ఎందుకు పనికిరాకుండా పోయాయి. పాఠశాలల్లో రికార్డులు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటిదగ్గర చదువు కునేందుకు సైతం పుస్తకాలు లేకుండా పోయాయి. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వెంటనే విద్యార్థుల చదువులు కొనసాగేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.










