Jan 29,2023 21:35

- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ
- ఉత్సాహంగా అవరావతి బాలోత్సవం ప్రారంభం

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ (విజయవాడ):విద్యార్థులు సామాజిక స్పృహతో వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ అన్నారు. అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండుగ విజయవాడ వన్‌టౌన్‌ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఘనంగా ప్రారంభమెంది. మూడు రోజులపాటు జరిగే ఈ బాలోత్సవంలో తొలుత చొక్కాపు వెంకటరమణ జాతీయ పతాకాన్ని, అమరావతి బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు చలువాది మల్లిఖార్జునరావు బాలోత్సవం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాలోత్సవం అధ్యక్షులు ఎస్‌పి.రామరాజు అధ్యక్షతన జరిగిన సభలో వెంకటరమణ ప్రారంభోపన్యాసం చేస్తూ.. చదువుతోపాటు సాంస్కృతిక అంశాల్లోనూ విద్యార్థులు పాల్గని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించాలన్నారు. గెలుపుపోటములతో సంబంధంలేకుండా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్య అతిథిగా పాల్గన్న ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ కార్పొరేట్‌ పాఠశాలల్లో నేడు ఆటపాటలు కరువయ్యాయని, అమరావతి బాలోత్సవం ద్వారా పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడం ముదావహమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బాలోత్సవం బాధ్యులు వాసిరెడ్డి రమేష్‌ బాబు, కమిటీ గౌరవాధ్యక్షులు చలువాది మల్లిఖార్జునరావు, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బడ్డు నాగేశ్వరరావు తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో పలు బహుమతులు సాధించిన చెర్రీ అనే ఏడేళ్ల బాలుడు డ్రమ్స్‌ వాయిస్తూ తన ప్రతిభను ప్రదర్శించారు. మొదటి రోజున వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గని తమ ప్రతిభను చాటారు.