Sep 06,2022 09:02
  • అన్ని వ్యవస్థలపై మోడీ సర్కార్‌ దాడి : జాతీయ సదస్సులో వక్తల ఉద్ఘాటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక, కర్షక ఐక్యతతో మోడీ సర్కార్‌ ప్రజా, రైతు, కార్మిక, దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటం చేస్తామని సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శులు తపన్‌ సేన్‌, హన్నన్‌ మొల్లా, బి.వెంకట్‌ స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ తల్కటోరా స్టేడియంలో సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంఘాలు సంయుక్తంగా కార్మిక రైతు హక్కుల జాతీయ సదస్సు నిర్వహించాయి. ఆయా సంఘాల జాతీయ అధ్యక్షులు హేమలత, అశోక్‌ దావలే, ఎ.విజయరాఘవన్‌ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. దేశ సంపదను సృష్టించే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి ఐక్య పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన సంకల్పమని స్పష్టం చేశారు. దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై హింస అపూర్వ స్థాయికి చేరుకుందని వివరించారు. ''స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత లేని భారత దేశం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్వస్వం త్యాగం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిస్టు రిపబ్లిక్‌తో ప్రజలందరూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పొందుతారని వారు ఆశించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వారి వారసులుగా వారి కలలను సాకారం చేసేందుకు పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది'' అని పునరుద్ఘాటించారు.
 

                                                                           అన్ని వ్యవస్థలపై దాడి

ఈ కన్వెన్షన్‌లో సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ మాట్లాడుతూ 2018 సెప్టెంబర్‌ 5న చారిత్రాత్మకంగా మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ 2.5 లక్షల మందితో నిర్వహించామని, అలాంటి ర్యాలీనే మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 75 ఏళ్లలో ప్రజలు శ్రమతో నిర్మించిన వ్యవస్థను, పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్నదంతా ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న ప్రస్తుత మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. కరోనా రాకముందే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. మహమ్మారిని మోడీ ప్రభుత్వం నిర్వహించే విధానం రెండింటినీ మరింత దిగజార్చిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, వేతనాలు తగ్గుతున్నాయని అన్నారు. పని పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. సిఎంఐఇ నివేదిక ప్రకారం 20-24 ఏళ్ల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగం 42 శాతం ఉందని, లేబర్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ ఆల్‌ టైమ్‌ కనిష్టస్థాయి 38.8 శాతానికి పడిపోయిందని తెలిపారు. గ్రామీణ మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని, వారి పని భాగస్వామ్య రేటు 10శాతం కంటే తక్కువకు పడిపోయిందని వివరించారు. లక్షలాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, పర్మినెంట్‌ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. మోడీ పాలనలో ఉద్యోగాల క్యాజువలైజేషన్‌, కాంట్రాక్టరైజేషన్‌ చట్టబద్ధత పొందుతోందని విమర్శించారు. బడా కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడానికే మోడీ సర్కార్‌ పని చేస్తుందని విమర్శించారు. ఇటీవలి పాలు, పెరుగు, బియ్యం, గోధుమలు వంటి అన్ని నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి పెంచారని, లగ్జరీ వస్తువులపై జిఎస్‌టిని తగ్గించారని వివరించారు.
 

                                                         దేశాన్ని అమ్మేస్తున్న మోడీ : హన్నన్‌ మొల్లా

ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ మోడీ పాలనలో దేశ చరిత్రను మార్చేస్తున్నారని, మేథావులంతా జైళ్లో ఉన్నారని అన్నారు. స్టాన్‌ స్వామి లాంటోళ్లు జైళ్లోనే మరణించారని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించిన తరువాత, పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహిస్తామని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయాయని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టంతో అటవీ భూములను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయనున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో మోడీ సర్కార్‌ దిగిరావల్సి వచ్చిందని, రైతు సంఘాలన్ని ఒకే వేదికమీదకి వచ్చాయని తెలిపారు.
 

                                                               ఉపాధి హామీకి కేటాయింపులు తగ్గాయి

ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ వామపక్షాల మద్దతుతో వచ్చిన ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో 4 శాతం నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 2 శాతం, ఈ ఏడాది 1.7 శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ.1,498 కోట్ల మేర వేతనాలు చాలా నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. దేశంలోని కేరళలోనే పిడిఎస్‌ 90 శాతం అమలు అవుతుందని, యుపి, హర్యానా వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో కేవలం 30 శాతం మాత్రమే పిడిఎస్‌ అమలవుతుందని తెలిపారు. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలంటూ ప్రచారం చేస్తున్నారని, అదే కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తారని, దీనిపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. మోడీ సర్కార్‌ కార్పొరేట్‌, హిందూ మతతత్వ విధానాలను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు పరశురామ్‌ (సిసిజిఈడబ్ల్యు), దేబషిష్‌ బసు (బెఫి), అభిమన్యు (బిఎస్‌ఎన్‌ఎల్‌), శ్రీకుమార్‌ (ఎఐఎస్‌జిఈఎఫ్‌) భట్‌నగర్‌ (ఎఐఐఈఎ), ఎఐకెఎస్‌ అమ్రారామ్‌, ప్రకాశం మాస్టార్‌, డి.రవీంద్రన్‌, సునీల్‌ అధికారి, సుమిత్‌ దలాల్‌, ఎఐఎడబ్ల్యుయు నేతలు విక్రమ్‌ సింగ్‌, లలితా బలమ్‌, వి.వెంకటేశ్వర్లు, అమియా పాత్రా, బ్రిగ్లాల్‌ భారతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు ఎఆర్‌ సింధూ, ఎం.సాయిబాబా, ఆర్‌. లక్ష్మయ్య, ఎఐకెఎస్‌ నేతలు విజూ కృష్ణన్‌, కృష్ణ ప్రసాద్‌, ఏపి నేతలు బేబిరాణి, సుబ్బరావమ్మ, తెలంగాణ నేతలు జూలకంటి రంగారెడ్డి, ఆర్‌.వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.
 

                                               వి.వెంటేశ్వర్లు, ఎఐఎడబ్ల్యుయు ఏపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మోడీ ప్రభుత్వం పేదల చట్టాలను రద్దుచేసి పేదల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతుందని ఎఐఎడబ్ల్యుయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు విమర్శించారు. కేరళ మాత్రమే కనీస వేతనాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికీ రెండెకరాల భూమి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.10 లక్షలతో ఒక్కొక్క ఇల్లు, కనీస వేతనం రోజుకు రూ.600 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.