May 05,2023 12:05

విజయవాడ : నేడు మార్క్స్‌ 205వ జయంతిని పురస్కరించుకొని ... శుక్రవారం విజయవాడలోని మార్క్స్‌ ఎంగెల్స్‌ విగ్రహం వద్ద సిపిఎం నేతలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజానాట్యమండలి కళాకారులు నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు మార్క్సిజంపై గీతాలాపన చేశారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ... ప్రపంచాన్ని మూల మలుపుతిప్పిన సిద్ధాంతాల్లో మార్క్సిజం ఒకటి అన్నారు. సంవత్సరాలతరబడి ఉన్న సిద్ధాంతాలకు సవరణలుండవా ? అని చాలామంది అనుకుంటారు కానీ నేటికీ కూడా మార్క్సిజానికి చెదలుపట్టలేదని, ఎలాంటి సవరణలూ లేవని చెప్పారు. వర్గదోపిడీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని.. దోపిడీ చేయబడేవాళ్లు.. దోపిడీ చేసేవాళ్లు ఉంటారని మార్క్సిజం చెప్పినట్లు నేటికీ ఆ స్థితి కొనసాగుతుందని అన్నారు. దోపిడీ విధానం ఉన్నంతకాలం కష్టాలూ, కన్నీళ్లూ తప్పవని చెప్పారు. దోపిడీకి గురయ్యేవారు పోరాడాలి.. రాజ్యాధికారంలోకి రావాలి.. అనేది మార్క్సిజం చెప్పిన సిద్ధాంతమని వివరించారు. మార్క్సిజం అనే గ్రంథం నేటికీ అజరామరంగా, ప్రపంచవ్యాప్తంగా నిలబడిందన్నారు. గత 75 ఏళ్లుగా భారతదేశంలో నానాటికీ దోపిడీ పెరుగుతుందని... ప్రజలు నానాటికీ దరిద్రాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కొనుగోలు శక్తి పడిపోతుందన్నారు. అదే సమయంలో మార్క్సిజాన్ని అమలు చేసిన చైనాలో చూస్తే ... ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. 2030 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వరల్డ్‌ బ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ మోనిటర్‌ ఫండ్‌ చెప్పిందని అన్నారు. సిద్ధాంతాన్ని ఆచరణలో సక్రమంగా అమలుచేస్తే కచ్చితమైన ఫలితాలస్తాయనేది స్పష్టమయ్యిందన్నారు. మన దేశంలోని ప్రజల విముక్తి కోసం అందరినీ కలుపుకొని దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ... మార్క్స్‌ కు ముందు అనేక సిద్ధాంతాలు, విశ్లేషణలు వచ్చాయి కానీ ఈ సమాజాన్ని ఎలా మార్చాలి అనే విషయాన్ని మార్క్సిజం చెప్పిందన్నారు. దోపిడీ ఎలా ఉంది.. శ్రమ పాత్ర, శ్రామికుల కర్తవ్యం వంటి అనేక విశేష అంశాలను మార్క్సిజం తెలిపిందన్నారు. సోషలిజంకు భవిష్యత్తు లేదు.. అంతా పెట్టుబడిదారివర్గానిదే అని చెప్పే వాళ్లకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులే సమాధానమిస్తున్నాయని అన్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే విపరీతమైన ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పోరాటాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నారు. కార్మికులు, ఉద్యోగులు ఎలా దశలవారీగా పోరాడుతున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. దోపిడీ ఉన్నంతవరకూ పోరాటం ఉంటుందని మార్క్స్‌ తన రచనల ద్వారా స్పష్టం చేశారు అని వివరించారు.