Jul 21,2023 21:43

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :మణిపూర్‌ మారణహోమాన్ని ఖండిస్తూ ఈనెల 25న గ్రామ గ్రామాన సంఘీభావ ప్రదర్శనలు, సభలు నిర్వహించనున్నట్లు సిఐటియు, ఎపి రైతు సంఘం, ఎపి కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు తెలిపాయి. అఖిల భారత కమిటీల పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి, సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం ముందు భారత పరువు తీసే విధంగా జరిగిన హత్యాకాండను నిరోధించడంలో అక్కడి బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. పోలీసుల సమక్షంలోనే గిరిజన తెగకు చెందిన మహిళలపై మరో తెగకు చెందిన ముష్కరులు దౌర్జన్యం చేసి అత్యాచారానికి తెగబడ్డా, కనీస చర్యలు తీసుకునేందుకు మణిపూర్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తే చర్యలు తీసుకుంటారా? మేము తీసుకోవాలా అని ప్రశ్నించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. ఇప్పటికే 150 మంది చనిపోయారని, 50 వేలమంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని తెలిపారు. ఈ మొత్తానికి కేంద్ర బిజెపి సర్కారు వైఫల్యమే కారణమని తెలిపారు.