- రెండోరోజు ముఖ్యమంత్రికి నిరసనలు
ప్రజాశక్తి-తుళ్లూరు (గుంటూరు) : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గాల్లో గురువారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రధాన రోడ్డు మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సోదా చేశారు. ప్రధానంగా రైతులు, మహిళలు దీక్ష శిబిరాల నుంచి బయటకు రాకుండా పెద్ద ఎత్తున మోహరించారు. మందడంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను, వ్యాపార సంస్థలను పోలీసులు మూసివేయించారు. సచివాలయానికి వెళ్లే ఆర్‌టిసి బస్సులను సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

కౌలు చెల్లించాలని నినాదాలు
సిఎం జగన్ మోహన్‌రెడ్డికి రాజధాని రైతుల నుంచి రెండో రోజు కూడా నిరసన సెగ తగిలింది. గురువారం మందడంలోని రైతు దీక్షా శిబిరం ముందుగా సిఎం జగన్ కాన్వారు వెళ్తున్న సమయంలో దీక్షా శిబిరంలోని రైతులు, మహిళలు నల్ల జెండాలు, ఫ్ల కార్డులు పట్టుకొని రోడ్డుపైకి వచ్చేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. మే నెలలో చెల్లించాల్సిన కౌలును ఇప్పటివరకు చెల్లించలేదని, ఎప్పుడు చెల్లించేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని నినాదాలు చేశారు.










