రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలను చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు
విజయవాడ : రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ... విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు కలిసి బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ... రాజధాని అమరావతిలోని పారిశుద్ధ్య కార్మికులతో తీవ్రమైన ఎండలు, వడగాల్పులలో సైతం పనులు చేయించి, చేసిన పనికి కార్మికులకు జీతాలు చెల్లించకుండా కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు ? కార్మికులు జీతాల కోసం రోడ్ల మీదకు వచ్చి పోరాడితే తప్ప జీతాలు చెల్లించరా అని అడిగారు. కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని చెబుతున్నారు కానీ పర్మినెంట్ సంగతి అలాగే ఉండిపోయిందని, కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. మూడో నెల జరుగుతున్నప్పటికీ జీతాలు చెల్లించకపోతే కార్మికులు వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారు అని ప్రశ్నించారు. ఎర్రని ఎండలో కార్మికులతో చాకిరీ చేయించిన సి ఆర్ డి ఏ అధికారులు.. జీతాలు చెల్లించాలని అడిగితే సాకులు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రాజధాని పారిశుధ్య కార్మికుల రెండు నెలల పెండింగ్ జీతాలు చెల్లించకపోతే మరో దశ పోరాటానికి కార్మికులు సిద్ధం అవుతారని నేతలు సిహెచ్ బాబురావు, ఎం రవి హెచ్చరించారు.










