May 24,2023 13:50

అమరావతి : మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు క్షమాపణ చెప్పాలని రాజధాని ప్రాంత మహిళా రైతులు డిమాండ్‌ చేశారు. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ... దీక్షా శిబిరాల్లో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా తమకు లేదా ? అని ప్రశ్నించారు. డీఎస్పీ అసభ్య పదజాలంతో దూషించారని మహిళలు ఆరోపించారు.

బుధవారం మహిళలు మీడియాతో మాట్లాడుతూ .... తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములివ్వడమే తాము చేసిన తప్పా ? అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టానుసారం ప్రవర్తిస్తారా ? మహిళలని కూడా చూడకుండా లాగి పడేస్తారా ? భూములిస్తే తమను ఇబ్బంది పెడతారా ? ఆర్‌5 జోన్‌ సఅష్టించి భూములిస్తారా ? తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వాళ్లను అరెస్టు చేస్తారా ? దీక్షా శిబిరాల్లోకి తమను రానీయకుండా అడ్డుకుంటారా ? డీఎస్పీ అయి ఉండి ఆడవాళ్లను తోసేస్తారా ? అంటూ ప్రశ్నలతో ధ్వజమెత్తారు. డీఎస్పీ మహిళలందరినీ అసభ్య పదజాలంతో దూషించారనీ, భూములు ఎవరు ఇవ్వమన్నారంటూ ఆయన అడగడమేంటి ? అని మండిపడ్డారు. తామంతా పొలాలు ఇచ్చి రోడ్డున పడ్డామనీ.. తమను ఆదుకోవాలని కోరారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు క్షమాపణ చెప్పాలని మహిళా రైతులు డిమాండ్‌ చేశారు.