Jun 20,2022 07:44
  • రెండున్నరేళ్లుగా నిలిచిన పనులు
  • జిఒ 365 పేరుతో సాగునీటి పనులు నిలిపివేత
  • ప్రశ్నార్థకంగా 80వేల ఎకరాలు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నంబరు 365తో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టు పనులు సైతం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మెదటి దశ కింద చేపట్టిన రూ.4,500 కోట్ల విలువైన నిర్మాణపు పనులు ఆగిపోయాయి. దీంతో 80వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలోని కర్నూలు, అలూరు, పత్తికొండ, నందికొట్కూరు, పాణ్యానికి సాగునీటిని అందించే హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) మొదటి దశ పనులు రెండున్నర ఏళ్లుగా నిలిచిపోయాయి.
      పత్తికొండ సమీపంలోని పందికొనవద్ద 1.126 టిఎంసిల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్‌ పనులు పూర్తికాకపోవడంతో కర్నూలు జిల్లాలోని కర్నూలు, అలూరు, పత్తికొండ, నందికొట్కూరు, పాణ్యానికి సాగునీరు అందడం లేదు.రిజర్వాయర్‌లో రాతికట్టడం (రివిట్‌ మెంట్‌ ) పనులు, మట్టికట్టపై ప్యార్‌ ప్యాట్‌ పనులు, రిజర్వాయర్‌ కిందభాగంలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు టూ డ్రయిన్‌ నిర్మాణం, రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేందుకు మరో తూము నిర్మాణం, కుడి, ఎడమ కాల్వల కింద నిర్మించాల్సి ఉంది. వాటి కోసం 67 ఎకరాల భూసేకరణ చేయాలి. రిజర్వాయర్‌ కింద కుడి కాల్వ 200 స్ట్రక్చర్లు, ఎడమ కాల్వలో 100కు పైగా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రైతుల పొలాల్లో 40 కిలోమీటర్ల పొడవునా పంటకాల్వల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెద్ద కాలువల నిర్మాణం పూర్తికావడంతో వాటి నుంచి రైతులు మోటర్ల ద్వారా పొలాలకు నీటిని మళ్లించుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులపై మంత్రి గుమ్మనూరు జయరాం గత నెల సమీక్ష నిర్వహించారు. నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ గజం పనులు కూడా ముందుకు సాగలేదు. కర్నూలు, అనంతపురం జిల్లాలో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు, 10 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడం లక్ష్యంగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకాన్ని 2005లో కాంగ్రెస్‌ హయంలో పనులు ప్రారంభించిన సంగతి తెలిసింది.

 

Stopped, Handri


                                                            మోటార్ల ద్వారా నీటిని పెట్టుకోవాలి

హంద్రీనీవా పంట కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రధాన కాలువల నుండి పొలాలకు నీటిని డీజిల్‌ మోటార్ల ద్వారా పెట్టుకొని పంటలు పండించు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన డీజిల్‌ ధరల వల్ల ఆర్థిక భారం పడుతోంది. దీని ద్వారా పంటల పెట్టుబడి పెరుగుతోంది.
                      - రామకృష్ణ, వెలమకూరు

 

Stopped, Handri

   
                                                             పిల్ల కాలువ నిర్మాణం చేపట్టాలి

హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయినప్పటికీ పిల్ల కాలువల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పాలక ప్రభుత్వాలు, అధికారులు పిల్ల కాలువల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలి.
                                                                              - యూసూఫ్‌, దేవనకొండ