- పరిష్కారానికి నోచని సమస్యలు
- పట్టించుకోని ప్రభుత్వం
- పరిశ్రమగా గుర్తించాలని వృత్తిదారుల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కష్టాల కడలిలో కల్లుగీత కార్మికులు అల్లాడిపోతున్నారు. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో కల్లుగీత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల కుటుంబాలకుపైగా ఉన్న కల్లుగీత కార్మికులకు మరింత నైపుణ్యతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేలా కృషి చేయాల్సిన పాలకవర్గాలు కల్లుగీత వృత్తిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక కల్లుగీత కార్మికులకున్న సౌకర్యాలను, పథకాలను కూడా తొలగించిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వంక, వాగు పోరంబోకు భూముల్లో పెద్దఎత్తున ఉండే ఈత, తాటిచెట్ల భూములన్నీ కబ్జాలకు గురికావడంతో తాటి, ఈత చెట్ల తోపులు అన్నీ మాయమయ్యాయి. కల్లుగీత వృత్తిని కాపాడేలా ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. కనీసంగా పొలాల గట్లమీదైనా చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ద్వారా చేయూత లభించేది. గీత కార్మికుల కోసం ఉన్న ప్రత్యేక పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసి సామాన్యుల తరహాలో బీమా తీసుకోవాలని నిబంధనలు తయారుచేసి వారిని అన్యాయం చేస్తోంది. ఎత్తయిన చెట్లు ఎక్కడం, దిగడం ంటి ప్రమాదకరమైన కల్లుగీత వృత్తిని ప్రభుత్వం ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. ప్రమాదాల్లో మృతి చెందినవారికి, అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్‌గ్రేషియాను ఎక్సైజ్‌శాఖ నుంచి ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు. కేరళ, గోవా తరహాలో గీత వృత్తిని లాభసాటిగా మార్చాలంటున్నారు. నీరా ఆరోగ్యపరంగా మంచిదని అనేక నివేదికలు చెబుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం నీరా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, కల్లును ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త ఎక్సైజ్ పాలసిలోనైనా కల్లుగీత వృత్తికి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమగా గుర్తిస్తూ కల్లుగీత కార్మికులకు ప్రోత్సాహకాలు కల్పించాలని ఎపి కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది.
29న రాష్ట్రస్థాయి సదస్సు
ఈ నెల 29న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు ద్వారా కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వృత్తిదారుల సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనరు భాస్కరయ్య తెలిపారు. నీరా, కల్లును నేచురల్ డ్రింక్‌గా ప్రభుత్వం ప్రచారం కల్పించి గీత కార్మికుల ఉపాధికి మెరుగైన చర్యలు చేపట్టాలని కోరారు.










