- కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మెరుపులు వృథా..
- ఉత్కంఠ పోరులో బెంగళూరుపై వికెట్ తేడాతో లక్నో గెలుపు
బెంగళూరు : ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో మరో ఉత్కంఠ మ్యాచ్ సోమవారం జరిగింది. బెంగళూరు నిర్దేశించిన 213పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి ఛేదిం చింది. చివరి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీసి లక్నో జట్టును గెలిపిం చాడు. ఆ మ్యాచ్‌లో విజయం ఇరుజట్లను చివరి బంతి వరకు ఊరించింది. ఛేదనలో భాగంగా స్టొయినీస్, పూరన్ క్రీజ్‌లోకి వచ్చేవరకు బెంగళూరు పక్షాన ఉన్న విజయం.. వీరిద్దరి రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. స్టొయినీస్(65; 30బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు), పూరన్(62; 19బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు) లక్నో గెలుపులో కీలకపాత్ర పోషించారు.
తొలుత లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాప్-3 బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఔటవ్వగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ అవుట్ కావడంతో బరిలో దిగిన మ్యాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 212పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రాకు ఒకోక వికెట్ దక్కాయి. ఛేదనలో లక్నో టాపార్డర్ నిరాశపరిచినా.. పూరన్, స్టొయినీస్ అర్ధసెంచరీలతో మెరిసారు. చివర్లో బడోనీ(30) ఫర్వాలేదనిపించాడు. సిరాజ్, పార్నెల్‌కు మూడేసి, హర్షల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పూరన్‌కు లభించింది.











