- దయనీయంగా పోలవరం నిర్వాసితుల బతుకులు
ప్రజాశక్తి - చింతూరు, ఎటపాక, విఆర్.పురం : గోదావరి, శబరి నదుల ప్రవాహ ఉధృతి శనివారం రాత్రి నుంచి తగ్గినప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్.పురం, చింతూరు, ఎటపాక, కూనవరంలో గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. అయితే, నదులు కాసింత శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో సుమారు 45 వేల మంది ముంపునకు గురై నిరాశ్రయులుగా మారారు. ఎగువున కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన గోదావరి పోలవరం నిర్వాసిత మండలాలను నిలువునా ముంచేసింది. గతంలో ఎంత వరద వచ్చినా త్వరగానే తగ్గిపోయేదని, నేడు ఐదు రోజులుగా వరద నిలిచి ఉందని, తగ్గడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఉందని ఎటపాక వాసులు వాపోయారు. వరద ప్రభావం ఇంతలా పెరగడానికి ప్రణాళిక లేని పోలవరం నిర్మాణమే కారణమని బాధితులు అంటున్నారు. గుట్టలపైకి చేరి భయానక పరిస్థితుల్లో బతుకుతున్నామని, ప్రభుత్వం నుంచి అందే సహకారం అంతంత మాత్రంగానే ఉందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 'బియ్యం తప్ప ఇంకేం సహాయం అందలేదు. ముంపు వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితి. అడవుల్లోని డొంక బాటలు మూసుకుపోయాయి. ఏం తిని బతకాలి' అని విఆర్.పురం మండలం రేఖపల్లికి తరలివచ్చిన బాధితులు వాపోతున్నారు. సిఎం ప్రకటించిన సాయమేదీ తమకు అందలేదని తెలిపారు.
సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం
రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం చింతూరులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. చింతూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకుంటున్నారు. గతంలో ముంపు మండలాల్లో పని చేసి పిఒగా సేవలందించిన ఆకుల వెంకటరమణను, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్‌ను ముంపు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వరద పోటు తగ్గిందని, పారిశుధ్య పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు.

తాగునీరు కూడా లేదు
మూడు రోజులుగా వరద నీటిలో ఉంటున్నాం. కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. సుమారు 50 కుటుంబాలు వారిమి డాబాలపైకి ఎక్కి ఉంటున్నాయి. ఇప్పటి వరకూ అధికారులు తమను పట్టించుకున్న పాపానపోలేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వరద నీటిలో ఉండాలో తెలియడం లేదు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలి.
- వేములపల్లి నాగేశ్వరరావు, నందిగామ, ఎటపాక మండలం

ప్రభుత్వ సాయం అందలేదు
మా గ్రామంలో సుమారు 70 ఇళ్లు నీట మునిగాయి. కొందరు బంధువుల ఇళ్లలో, మరికొందరు స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ సాయమేమీ అందలేదు.
- సోయం రాజమ్మ, కెఎన్.పురం










