- 'పోలవరం' వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- 2022 వరదల ప్రభావం నుంచి నేటికీ తేరుకోని నిర్వాసితులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఈ సమస్య ఆ రెండు కుటుంబాలకు పరిమితమే కాలేదు. గత ఏడాది వచ్చిన గోదావరి వరదలకు ఇళ్లు కూలిన పోలవరం నిర్వాసిత మండలాల్లోని చింతూరు, కూనవరం, విఆర్.పురం, ఎటపాకల్లో పలు కుటుంబాల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. 2022 జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో గోదావరి వరదలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. ఒక్కసారిగా జళప్రళయం ఊళ్లకు రావడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు పరుగులు తీశారు. కొండలు, గుట్టలు, అడవులలో తలదాచుకున్నారు. పోలవరం వద్ద నీటిమట్టం 37 మీటర్లకు చేరుకోవడంతో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకొళ్లింది. శబరి పరివాహక ప్రాంతాలు సైతం పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి వరద తగ్గాక చింతూరు మండలం చట్టి, వేలేరుపాడులలో సభలు నిర్వహించారు. ప్రతి బాధిత కుటుంబానికీ ప్రభుత్వం నుంచి రూ.10 వేలు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆచరణలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం కూలిపోయిన గుడిసెలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. వాటిలోనూ 20 శాతం ఇళ్లకే పరిహారం అందించారు. విఆర్.పురం మండలం సోములగూడెంలో 150 ఇళ్లకుగానూ 60 పూరి గుడిసెలు పూర్తిగా నేలమట్టమవ్వగా వాటిలో 12 ఇళ్లకు, చింతూరు మండలం మల్లెతోటలో 170 ఇళ్లకుగానూ వాటిలో 40 ఇళ్లకు మాత్రమే రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం అందింది. కూనవరం, ఎటపాక మండలాల్లోనూ ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. పూరి గుడిసె పున్ణ నిర్మించుకునేందుకు తాటి ఆకులు, వాసాలు, మొత్తం కలిపి సుమారు రూ.60 వేలు ఖర్చవుతుందని బాధితులు తెలిపారు. ఇళ్లల్లో బురద నిలిచిపోవడంతో వాటిని తొలగించుకునేందుకు ఇంటి విస్తీర్ణం ఆధారంగా రూ.10 వేలు నుంచి రూ.25 వేలు వరకూ వెచ్చించక తప్పలేదు. ఇది అదనపు భారమైంది. ఇంటి పున:నిర్మాణ వ్యయం వెచ్చించలేక బాధితుల్లో అనేకమంది పైకప్పు మాత్రమే వేసుకుని జీవిస్తున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సోడి జానకమ్మ. చింతూరు మండలం మల్లెతోట. గత ఏడాది వచ్చిన గోదావరి వరదల కారణంగా ఆ గ్రామమంతా పూర్తిగా ముంపునకు గురైంది. దీంతో, ఆమె ఇల్లు కూలిపోయింది. వరదలు తగ్గిన కొంతకాలానికి ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న ఆమె వద్ద అంత పెద్ద మొత్తం లేకపోవడంతో పైకప్పు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ గోడలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణ కరువై ఇబ్బంది పడుతున్నారు. ఆమె భర్త ఆనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణకు అన్నీ తానై శ్రమిస్తున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జల్ది వీరయ్య. విఆర్.పురం మండలం ధర్మతాళ్లగూడెం. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. గత ఏడాది వచ్చిన వరదలకు ఇంటి వాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నుంచి సాయం లభించలేదు. అడవి నుంచి కలప తెచ్చుకుందామని ప్రయత్నిస్తే అటవీ శాఖాధికారులు ఒప్పుకోవడం లేదు. దీంతో, కప్పు కుంగిపోయిన ఇంటిలోనే జీవనం సాగిస్తున్నారు.










