బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించగా, ఆసీస్ ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతేగాక టీమిండియాపై ఇండోర్ మ్యాచ్‌లో విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, తల్లికి చికిత్స కొనసాగుతుండడంతో కమిన్స్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. మార్చి 9న భారత్ తో నాలుగో టెస్టు జరగనున్న నేపథ్యంలో, ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌నే కొనసాగించనునట్లు తాజాగా ధృవీకరించింది. టీమిండియా ఈ సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి టెస్టులో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.










