నిధుల కొరత
న్యూఢిల్లీ : ఎన్నో ఆశలతో మొదలైన స్టార్టప్‌లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా సంక్షోభ చాయలు తొలిగిపోకముందే.. దేశంలో అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులు ఈ సంస్థలను బక్కచిక్కేలా చేస్తున్నాయి. నిధుల కొరత, ప్రభుత్వ మద్దతు కొరవడటంతో వాటి కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. అనేక స్టార్టప్‌లు నష్టాలతో ఎదురీదుతున్నాయి. కొన్ని సంస్థలు మూత పడుతుండగా.. మరికొన్ని సంస్థలు కష్టాల కడలిలోనూ గట్టెక్కె ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక భారం తగ్గించుకునే యత్నంలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నమ్ముకున్న సంస్థలు అర్థంతరంగా మూత పడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. వరుస నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి.
ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు ప్రముఖ స్టార్టప్‌లు ఏకంగా 10,500ల మంది ఉద్యోగులను తొలగించాయని అంచనా. నష్టాలు, కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన తొలగింపు చర్యలు మే వచ్చే సరికి ఎక్కువ అయి పోయాయి. రోజుకో స్టార్టప్ కంపెనీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.
ఓలాలో 2100 మందికి ఎసరు
దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. జనవరి నుంచి జూన్ వరకు ఈ సంస్థ ఏకంగా 2100 మంది ఉద్యోగులను తొలగించింది. ఎడ్యుకేషన్ యాప్ అయినా అన్ అకాడమీ కంపెనీ 750 మందికి ఉద్వాసన పలికింది. ఎంతో గుర్తింపు కలిగిన ఓలా, అన్అకాడమీ పరిస్థితే ఇలా ఉంటే చిన్న, పెద్ద స్టార్టప్‌ల పరిస్థితి దారుణంగా ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యవస్థల్లో నిలదొక్కుకున్న సంస్థలుగా గుర్తింపు దక్కించుకున్న మీషో, వేదాంతూ, బ్లింకిట్, కార్24 వంటి సంస్థలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే వస్తున్న నష్టాల పట్ల వెంచర్ క్యాపిటలిస్టులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరిన్ని నిధులు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆర్థిక భారం మరింత ముదరకుండా ఉద్యోగుల తొలగింపే మేలైన పరిష్కారం అనే భావనలోకి స్టార్టప్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గిపోయి ప్రయివేటు సంస్థలే దిక్కు అనే పరిస్థితులు నెలకొనగా.. స్టార్టప్‌లు సైతం చేతులు ఎత్తేడయంతో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారే పరిస్థితులు ఎదురవడానికి ఎంతో దూరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.










