ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవాళ రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు సీతా రెడ్డి, అశ్వర్థనాయక్, సుబ్బరాజు, శేషుబాబు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బ్రహ్మౌత్సవాల్లో ఆరవ రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,884గా ఉంది. నిన్న హుండీ ఆదాయం 2.70 కోట్లుగా ఉంది. ఇక, 32,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.










