Jul 22,2022 10:30
  • తుంగభద్ర నుంచి నీటి విడుదల
  • సుంకేసుల, పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీరు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : గత పది రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఐదు గేట్ల ద్వారా 24,120 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 40,918 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 1,11,269 క్యూసెక్కులతో కలిపి మొత్తంగా 1,76,307 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారానికి 880 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టిఎంసిలు కాగా 188.1360 టిఎంసిలుగా నమోదైంది. తెలంగాణ పరిధిలోని ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి గడచిన 24 గంటల్లో 1,20,989 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 1,30,626 క్యూసెక్కుల నీరు డ్యాం లోకి వచ్చి చేరుతోంది. దీని నిల్వ సామర్థ్యం 105.788 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 100.718 టిఎంసిలుగా ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1631.73 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు పోటెత్తడంతో ఐదు గేట్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
      సుంకేసుల బ్యారేజ్‌ వద్ద 23 గేట్లను ఒక మీటరు మేర, నాలుగు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 1,11,269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,13,281 క్యూసెక్కుల నీరు శ్రీకాకుళం బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. సుంకేసుల బ్యారేజీ నీటి మట్టం 950.46 అడుగులుగా, నీటి నిల్వ 0.484 టిఎంసిలుగా ఉంది. కెసి కెనాల్‌కు 2,012 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భానకచర్ల నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు తొమ్మిది వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటి నిల్వ 1.5 టిఎంసిలుగా నమోదైంది.