Apr 10,2023 15:50

గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ను ఉద్దేశించి కేకేఆర్‌ ట్వీట్‌ చేసి క్రీడాభిమానుల మనుసులు గెలుచుకుంది. ఐపీఎల్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఆరంభంలో తడబడ్డా.. వెంకటేశ్‌ అయ్యర్‌(83), నితీశ్‌ రాణా(45), ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు మర్చిపోలేని విజయం అందించాడు. ఇక మ్యాచ్‌ అనంతరం కేకేఆర్‌ యశ్‌ దయాల్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ''తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే యశ్‌. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా పుంజుకుని నువ్వేంటో నిరూపించుకుంటావు'' అంటూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.