Jul 08,2023 22:23

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లోకి సౌత్‌, వెస్ట్‌జోన్‌ జట్లు ప్రవేశించాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నార్త్‌జోన్‌తో జరుగుతున్న సెమీస్‌లో సౌత్‌ జోన్‌ జట్టు 2వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఆలూరు కస్కా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మరో సెమీస్‌లో వెస్ట్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో సెంట్రల్‌జోన్‌ జట్టుపై గెలిచాయి. నార్త్‌జోన్‌ నిర్దేశించిన 215పరుగుల లక్ష్యాన్ని సౌత్‌జోన్‌ జట్టు 36.1 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 20పరుగులతో శనివారం చివరిరోజు ఆటను కొనసాగించిన సౌత్‌జోన్‌ను మయాంక్‌ అగర్వాల్‌(54), కెప్టెన్‌ హనుమ విహారి(43), రికీ బురు(34), తిలక్‌ వర్మ(25) బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. టి విరామం తర్వాత వర్షం కారణంగా కొంతసేపు ఆటకు అంతరాయం కలిగినా.. ఆ తర్వాత సౌత్‌జోన్‌ బ్యాటర్స్‌ ధీటుగా ఆడారు. నార్త్‌జోన్‌ బౌలర్లు హర్షీత్‌ రాణాకు మూడు, బల్జీత్‌ సింగ్‌, వైభవ్‌ అరోరాకు రెండేసి వికెట్లు దక్కాయి.
వెస్ట్‌జోన్‌ రికార్డుస్థాయిలో 34వ సారి ఫైనల్‌కు..
ఆలూరు కస్కా స్టేడియంలో జరుగుతున్న మరో సెమీస్‌లో సెంట్రల్‌జోన్‌ జట్టుపై వెస్ట్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో విజయం సాధించింది. వెస్ట్‌జోన్‌ జట్టు నిర్దేశించిన 390పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరిరోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌జోన్‌ జట్టు వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి 35ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 128పరుగులు చేసింది. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్‌ జట్టు 220పరుగులు, సెంట్రల్‌ జోన్‌ జట్టు 128పరుగులే చేయడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో వెస్ట్‌జోన్‌ జట్టు విజయం సాధించింది. దీంతో వెస్ట్‌జోన్‌ జట్టు రికార్డుస్థాయిలో 34వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. వెస్ట్‌జోన్‌ జట్టు ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 19సార్లు టైటిల్‌ను చేజిక్కించుకుంది. వెస్ట్‌ాసౌత్‌జోన్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం(12న) జరగనుంది.