ఐపీఎల్-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్ తలపడింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లో జట్టుకు ఘన విజయం అందించాడు. కానీ, తొలి పోరులోనే అతను జరిమానా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు సూర్యకుమార్ యాదవ్‌కు 12 లక్షల జరిమానా విధించారు.
- నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ మ్యాచ్ ఫీజులో కోత..
ముంబై బౌలర్ హృతిక్ షోకీన్- కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరికీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. మైదానంలో పరస్పరం అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఇరువురి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్ రాణా ఫీజులో 25 శాతం కోత పెట్టారు.అదే విధంగా.. హృతిక్ షోకీన్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేశాడు. అనంతరం ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో ముంబై 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.










