Sep 20,2023 21:37
  •  రైతుల దీక్షా శిబిరం వద్ద సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు మందడంలోని రైతు దీక్షా శిబిరం ముందు నుండి సచివాలయానికి వెళుతున్న సమయంలో రైతులు నినాదాలు చేస్తూ రోడ్డు పైకి రావడానికి యత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిఎం కాన్వారు వెళ్లే వరకూ రైతులు, మహిళలు రోడ్డుపైకి రాకుండా తాళ్లతో అడ్డుగా నిలబడ్డారు. మే నెలలో ఇవ్వాల్సిన కౌలు ఇంతవరకు చెల్లించ లేదని, రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, మా కొద్దు రాక్షస పాలన అంటూ రాజధాని రైతులు, మహిళలు ఫ్ల కార్డులు ప్రదర్శించారు. నల్ల జెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వృద్ధులు, చిన్నారులు సైతం నిరసన తెలిపారు. కౌలు ఇవ్వని అప్పుల ముఖ్యమంత్రి రైతులు, ప్రజలకు అప్పులు చేయమని నేర్పుతున్నారంటూ ఫ్ల కార్డులను చిన్నారులు ప్రదర్శించారు. అనంతరం రైతులు శిబిరంలోకి వెళ్లి యధావిధిగా దీక్షలు కొనసాగించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న దీక్షలు బుధవారంతో 1373 వ రోజుకు చేరాయి.