Jul 06,2023 21:14

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ప్రాంతంలో బిసిలు, దళితుల నుంచి 1,100 ఎకరాల అసైన్డ్‌ భూమిని కాజేశారనే సిఐడి కేసును కొట్టేయాలని మాజీ మంత్రి పి నారాయణ దాఖలు చేసిన కేసులపై ఆగస్టు 10న తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. నారాయణ, ఆయన బంధువులు, బినామీలపై 2020లో సిఐడి నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ వారంతా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. గతంలోని ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను తదుపరి విచారణ జరిగే ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు సిఆర్‌పిసి 41-ఎ సెక్షన్‌ను అనుసరించాలంది. అనారోగ్య సమస్యల కారణంగా వైద్య చికిత్స కోసం విదేశాలు వెళ్లేందుకు వీలుగా నారాయణ మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు ఉత్తర్వులు పొందారు. తాజాగా జరిగిన విచారణ సమయంలో తిరిగి వాయిదా వేయాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరగా.. సిఐడి తరఫున అదనపు ఎజి పి సుధాకర్‌రెడ్డి వ్యతిరేకించారు. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వస్తారని చెప్పి వాయిదా కోరడం అన్యాయమన్నారు. నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కల్పించుకుని సిఐడి కూడా వాయిదాలు కోరిందన్నారు. దీంతో ఆగస్టు 10న తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.