అమరావతి : అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులపై ఏపీకి చెందిన అధికారులు పంజా విసురుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందిస్తున్న అధికారులు పక్కా వ్యూహంతో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ జైలు పాలు చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం అవినీతి శాఖ అధికారులు దాడులు చేశారు. కార్యాలయం సూపరింటెండెంట్ సయ్యద్ లతీఫ్ ఓ ఉద్యోగి నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.ఉద్యోగుల పరస్పర అంగీకార బదిలీలో ఆయన లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తరువాత రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.










