ఒట్టావా(కెనడా): కెనడా ఓపెన్ సూపర్500లో క్వార్టర్‌ఫైనల్లోకి భారత టాప్ షట్లర్లు లక్ష్యసేన్, పివి సింధు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో సింధు ప్రత్యర్ధి జపాన్‌కు చెందిన నట్సుకీ నిడైర్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. దీంతో సింధుకు వాకోవర్ లభించింది. ఇక లక్ష్యసేన్ 21-15, 21-11తో బ్రెజిల్‌కు చెందిన యోర్ కొహెల్కోపో వరుససెట్లలో నెగ్గాడు. ఈ మ్యాచ్‌ను లక్ష్యసేన్ కేవలం 31 నిమిషాల్లోనే ముగించాడు. తొలి గేమ్‌ను పోరాడి నెగ్గిన లక్ష్యసేన్.. రెండో గేమ్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో ప్రత్యర్ధి కోలుకొనే అవకాశం దక్కలేదు. క్వార్టర్‌ఫైనల్లో సింధు.. 2022 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ గో-ఫెంగ్-జియో(చైనా)తో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పివి సింధు 15వ ర్యాంక్‌కు దిగజారిన సంగతి తెలిసిందే. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన లక్ష్యసేన్.. బెల్జియంకు చెందిన జులెన్ కర్రగ్గితో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్ గరగావిష్ణువర్ధన్ జోడీ ప్రి క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. ప్రి క్వార్టర్స్‌లో భారతజోడీ 9-21, 11-21తో ఇండోనేషియాకు జోడీ చేతిలో ఓటమిపాలైంది.










