భూ యజమాని సంతకం తప్పనిసరి నిబంధన సవరించాలి: 12న పాదయాత్ర : కౌలు రైతు సంఘం
ప్రజాశక్తి -నందిగామ (ఎన్‌టిఆర్) : భూ యజమాని సంతకం తప్పనిసరి నిబంధనను సవరించాలని ఈ నెల 12వ తేదీన విజయవాడ నుండి మంగళగిరి సీసీఎల్‌ఏ ఆఫీస్ వరకు జరుగు పాదయాత్రను జయప్రదం చేయాలని కౌలు రైతులు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు పిలుపునిచ్చారు. జూన్ 12వ తేదీన విజయవాడ నుండి మంగళగిరి వరకు జరుగు కౌలు రైతుల పాదయాత్రను జయప్రదం చేయాలని కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నందిగామ మండలం అడవిరావులపాడు, లింగాలపాడు ,పెద్దవరం గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అడవిరావులపాడు గ్రామంలో కౌలు రైతులను ఉద్దేశించి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ .... రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్న కౌలు రైతులకు 2019 పంట సాగు దారుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ... చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుకు సులభంగా గుర్తింపు కార్డు మంజూరు, భూ యజమాని సంతకం తొలగింపు సాధనే లక్ష్యంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్ 5 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు, సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. భూ యజమాని సంతకం తప్పనిసరి అయిన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదని అన్నారు. భూ యజమాని సంతకంతో పని లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, భీమా, ఈ క్రాప్, రాయితీపై రుణాలు, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రకఅతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే పరిహారం సౌకర్యం కల్పించి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ యజమాని కౌలు రైతులతో గ్రామ సభ నిర్వహించి అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం12 న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి సిసిఎల్‌ఏ కార్యాలయంకు వద్ద రాయబార పాదయాత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు సూరా శ్రీనివాసరావు, జి లక్ష్మీనారాయణ, కామసాని ప్రసన్న రాఘవాపురపు సుబ్బారావు, బండి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.










