Jun 21,2022 07:18
  • ఉదయం ఒక ధర..
  • సాయంత్రం మరో ధర

రైతులను అడ్డంగా దోచేస్తున్న ప్రొసెసింగ్‌ యూనిట్లు

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : రొయ్య సాగులో ప్రధానమైన సమస్యల్లో ధర ఒకటి. అయితే ఉదయం ఉన్న ధర...సాయంత్రం ఉంటుందో ఉండదో చెప్పలేని అయోమయ పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా బయ్యర్లకు, ప్రొసెసింగ్‌ యూనిట్లకు నిలకడగా ధర ఉన్నా.. ఆక్వా రైతుకు మాత్రం ఇది దఅందడం లేదు. రొయ్య ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీనత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
    ఆక్వా సాగులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 80 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఇక్కడి రొయ్య అమెరికా, రష్యా, చైనా, థాయిలాండ్‌, జపాన్‌ వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. రొయ్యకు సంబంధించిన ఉత్పత్తి అంతా అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది. అలా నిర్ణయమైన ధర బయ్యర్లకు రెండునెలల వరకు నిలకడగా ఉంటుంది. అదే ధర ప్రొసెసింగ్‌ యూనిట్లకు నెల వరకు ఉంటుంది. కానీ రైతులకు మాత్రం అది వర్తించడం లేదు. రైతులు ఆ రోజు పట్టే రొయ్యలను బట్టి ప్రొసెసింగ్‌ యూనిట్లు ధరను పెంచడం, తగ్గించడం చేస్తున్నాయి. వంద కౌంట్‌ ధర ఉదయం రూ.240 ఉంటే సాయంత్రానికి రూ.230కు పడిపోతుంది. 70 కౌంట్‌ ధర రూ..290 నుంచి రూ.270కు దిగజారిపోతుంది. 40 కౌంట్‌ ధర రూ.440 నుంచి రూ.340కి పడిపోతుంది. పట్టుమని రెండు రోజులు కూడా ధర నిలకడగా ఉండటం లేదు. బయ్యర్లకు, ప్రొసెసింగ్‌ యూనిట్లకు నెలకుపైగా ధర నిలకడగా ఉన్నప్పుడు అదే ధరను తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఆక్వారైతులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారి నిర్ణయమైన ధర కనీసంగా 15రోజులు నిలకడగా కొనసాగేటట్లు చూడాలని రొయ్య సాగుదారులు కోరుతున్నారు. ధర హెచ్చుతగ్గులతో రొయ్య రైతులకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ నష్టపోతున్నారు.
      ఒకపక్క మేత ధరల పెంపు, మరోపక్క నాణ్యమైన సీడ్‌ అందించకపోవడం, విద్యుత్‌ సబ్సిడీలు ఎత్తివేత రొయ్య రైతును కుదేలు చేస్తున్నాయి. రొయ్య ధరపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యవేక్షించాలని కోరుతున్నారు.
 

         వంద కౌంట్‌ ధర రూ.250కు తగ్గకుండా చూడాలి : విశ్వనాథ గోపాలకృష్ణ వర్మ(చినవర్మ), ఆక్వారైతు, చించినాడ

15 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. వందకౌంట్‌కు రొయ్యను తయారు చేయాలంటే కిలోకు రూ.200కు పైగా ఖర్చు అవుతోంది. ప్రస్తుతం ఉన్న ధరతో తీవ్రంగా నష్టపోతున్నాం. కిలో రొయ్య ధర రూ.250 తక్కువ కాకుండా నిర్ణయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ధర నిలకడగా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.