Jul 08,2023 13:27

ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా భోగాపురం మండలం విమానాశ్రయం నిర్వాసిత గ్రామమైన బొల్లింకల పాలెంకు చెందిన బొల్లెంకుల కార్తీక శరణ్య అంతర్జాతీయస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీలకు ఎంపికైంది. మండలంలోని బొల్లింకుల పాలెం గ్రామానికి చెందిన కార్తీక్‌ శరణ్య ఆగస్టు 18 నుండి 22 వరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగే పోటీలలో పాల్గొననుంది. ఇటీవల చండీగఢ్‌, మొహాలీలో జరిగిన సెలక్షన్‌లో పాల్గొని అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 30 పతకాలు సాధించింది. ఈ సందర్భంగా శరణ్యను మండలంలోని పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కోచ్‌లు సత్యనారాయణ, చిట్టిబాబు దగ్గర శిక్షణ పొందుతుందని తల్లి దండ్రులు అప్పన్నరెడ్డి, రత్న కుమారి తెలిపారు.