Sep 27,2023 09:04

న్యూఢిల్లీ : సీనియర్‌ తెలుగు పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా కోఆర్డినేటర్‌ ఉప్పాల ఆనంద్‌ (67) ఢిల్లీలో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో సోమవారం ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ ఆసుపత్రిలో చేరిన ఆనంద్‌ మంగళవారం రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం ఆనంద్‌ అంత్యక్రియలు జరుగుతాయని ఢిల్లీ జర్నలిస్టు వర్గాలు తెలిపాయి.

ఉప్పాల ఆనంద్‌ 1980లోనే ఢిల్లీలో పాత్రికేయ వృత్తి చేపట్టారు. తొలుత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేసిన ఆనంద్‌, తరువాత న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చాలా కాలం పనిచేశారు. పదవీ విరమణ అనంతరం కొద్దికాలం సాక్షి దినపత్రికలో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆనంద్‌ స్వస్థలం కోదాడ. ఆనంద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ మీడియా కోఆర్డినేటర్‌ దేవులపల్లి అమర్‌, సీనియర్‌ జర్నలిస్టులు రాజగోపాలన్‌, ఎ.కృష్ణారావు తదితరులు ఆనంద్‌ మరణం పట్ల తమ సంతాపం తెలియజేశారు.

                                                        జర్నలిస్ట్‌ ఆనంద్‌ మృతిపై సిఎం జగన్‌ దిగ్భ్రాంతి

గుంటూరు : సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆనంద్‌ కుమార్‌ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్‌ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సిఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్‌ మఅతి పట్ల జర్నలిస్ట్‌ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.